Vikram : విక్రమ్‌కు గుండెపోటు కాదు.. ఆ వార్తలన్నీ పుకార్లే, నిలకడగా చియాన్ ఆరోగ్యం: మేనేజర్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారన్న వార్తలతో యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. గతేడాది గుండెపోటు కారణంగానే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందారు. ఈ నేపథ్యంలో చియాన్ ఆరోగ్య పరిస్ధితిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ స్పందించారు. విక్రమ్ కు హార్ట్ ఎటాక్ రాలేదని.. ఛాతీలో స్వల్ప అసౌకర్యంగా అనిపించడంతో కావేరి ఆసుపత్రిలో చేరారని ఆయన తెలిపారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు వాస్తవం కాదని... అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూర్యానారాయణన్ అన్నారు. విక్రమ్ కుటుంబ సభ్యులకు, వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగేలా పుకార్లు రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాత్రికి లేదంటే రేపు కావేరి ఆసుపత్రి నుంచి విక్రమ్ డిశ్చార్జ్ అవుతారని సూర్యనారాయణన్ పేర్కొన్నారు. దీంతో అభిమానులకు ఊరట కలిగినట్లయ్యింది.
షూటింగ్ దశలో రెండు సినిమాలు:
ప్రస్తుతం విక్రమ్ పొన్నియన్ సెల్వన్ , కోబ్రా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్ 1’ మూవీ టీజర్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. ఇంతలో విక్రమ్ అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అన్నట్లు ఈ చిత్రంలో విక్రమ్ .. ఆదిత్య కరికాలన్ గా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. జయం రవి, కార్తీ, త్రిష, జయరామ్, ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో నటిస్తుండటంతో ‘పొన్నియిన్ సెల్వన్ 1’పై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇక కోబ్రా విషయానికి వస్తే.. ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout