ఘనంగా జరిగిన కోహినూర్-మహిళా శిరోమణి పురస్కారాలు

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం, తెలంగాణ టెలివిజన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా టెలివిజన్‌ పరిశ్రమలోని వివిధ శాఖలలో అమూల్య సేవలను అందిస్తున్న 18 మంది మహిళలను ఎంపిక చేసి 'కోహినూర్‌ మహిళా శిరోమణి' పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ హాలులో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి ముఖ్య అతిథిగా, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ విశిష్ట అతిథిగా ప్రముఖ నిర్మాత సాయి వెంకట్‌ ఆత్మీయ అతిథిగా పాల్గొనగా తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం అధ్యక్షులు నాగబాల డి.సురేష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి రాజేంద్రరాజు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలకు కె.వి.రమణాచారి శాలువా, ఫ్లవర్‌ బొకేలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు కె.వి.రమణాచారి మాట్లాడుతూ - ''ఐ.ఎ.ఎస్‌. కన్నా నేను అందరితో కలిసికట్టుగా వుండాలనేదే నా ఆకాంక్ష. సురేష్‌ ఎప్పుడు అన్ని కార్యక్రమాల్లోనూ చాలా యాక్టివ్‌గా వుంటాడు. కోహినూర్‌ శిరోమణి మహిళా పురస్కారాలను అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగే ప్రతి సంవత్సరం అవార్డులను అందిస్తూ ఎంతోమంది టాలెంట్‌ గల మహిళలను ఎంకరేజ్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సినిమాల కంటే టి.వి. మీడియాకు చాలా ఆకర్షణీయమైన పరిస్థితి వచ్చింది. టీవిలు లేని ఇళుఏది లేదు. నటీనటులకి, సాంకేతిక నిపుణులకి ఉపాధి కల్పిస్తుంది. ఫిల్మ్‌నగర్‌లా హైదరాబాద్‌లో టీవి నగర్‌ ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన నాకు గతంలో వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.గారి దృష్టికి తీసుకెళ్లి టీ.వి. నగర్‌ ఏర్పాటు అయ్యే దిశగా నావంతు కృషి చేస్తాను. మహిళలు వుంటేనే లోకం వుంటుంది. చరిత్రకెక్కిన ఎంతోమంది మహామహులు ప్రతి ఒక్కరి వెనుక వారి తల్లి ప్రేమ వుంది. పురస్కారాలు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన సురేష్‌ నాగబాబుని అభినందిస్తున్నాను'' అన్నారు.

తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం అధ్యక్షులు నాగబాల డి.సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ - ''25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. 28 సీరియల్స్‌ తీసాను. కొన్ని పుస్తకాలు రచించాను. మూడు సంవత్సరాలుగా మహిళా శిరోమణి పురస్కారాలు అందిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. టెలివిజన్‌ రంగంలో కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారందరికీ తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నటీనటులకు, సాంకేతిక వర్గానికి వచ్చేలా చూడాలని రమణాచారిగారిని కోరుకుంటున్నా. అలాగే టీ.వి. నగర్‌ అనేది కూడా ఏర్పాటు చేసి టెలివిజన్‌ రంగాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు అంతా మహిళలు లేనిదే సృష్టి లేదు. అలాంటి మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి చెందే దిశగా కృషి చెయ్యాలి. ఇలాంటి పురస్కారాలను ఘనంగా నిర్వహించిన నాగబాల సురేష్‌ ఎంతో అభినందనీయుడు అని ప్రశంసించారు.