బాహుబలి విషయంలో ఫస్ట్ మార్క్ ప్రొడ్యూసర్ కే ఇస్తాను. అందుకే...ఈగ సినిమా వర్క్ లో రాజమౌళిని అభినందిస్తాను - కోడి రామకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి....ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడంతో పాటు 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు, దేవి, అంజి, అరుంధతి సినిమాలతో గ్రాఫిక్స్ మాయాజాలాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారాయన. తాజాగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం నాగభరణం. రమ్య, సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో దివంగత కన్నడ హీరో విష్ణువర్ధన్ క్లైమాక్స్ లో 15 నిమిషాలు పాటు కనిపించబోతుండడం విశేషం. సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ కన్నడలో నిర్మించిన ఈ చిత్రాన్నిమల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం నాగభరణం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణతో ఇంటర్ వ్యూ మీకోసం...!
నాగభరణం రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎలా ఫీలవుతున్నారు..?
నిజమే మీరన్నట్టుగా రిలీజ్ కి ముందే నాగభరణం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నా సినిమాల్లో ఇలా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ టైమ్. ఇక ఎలా ఫీలవుతున్నారు అంటే....ఒక వైపు ఆనందంగా ఉంది. మరో వైపు టెన్షన్ గా ఉంది. అలాగే నేను ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు తీస్తే మిగిలిన అన్ని భాషల్లో డబ్ అయ్యేవి. ఇప్పుడు కన్నడలో తీస్తే తెలుగులో డబ్బింగ్ అవుతుంది.
అసలు నాగభరణం ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
నేను ముంబాయిలో వేరే సినిమా కోసం ఇళయారాజా గారితో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ సాజిద్ సినిమా చేద్దాం ఏదైనా డిఫరెంట్ స్టోరీ ఉంటే చెప్పండి అన్నప్పుడు ఈ స్టోరీ చెప్పాను. రెండు కథలు చెప్పాను. ఇందులో రెండో కథ బాగుంది ఈ కథ చేద్దాం అన్నారు. అయితే...కన్నడలో చేద్దాం నాకు అక్కడ మంచి సర్కిల్ ఉంది అన్నారు. నేను సరే అన్నాను. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రకు రమ్యను ఆయనే సెలెక్ట్ చేసారు. గ్రాఫిక్స్ చేయాలంటే చాలా టైమ్, బడ్జెట్ కూడా బాగా పెరుగుతుంది అంటే...ఆయన ఖర్చు గురించి ఆలోచించద్దు. ఎంత ఖర్చు అయినా చేస్తాను. సినిమా బాగా రావాలి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇంతకీ నాగభరణం కథ ఏమిటి..?
ఇది ఓ పాము కథ. గత జన్మలో సాధించలేనిది ఈ జన్మలో అమ్మాయిగా పుట్టి తన కోరిక తీర్చుకునే కథ. తన లక్ష్యం చేరుకుంటుంది అనుకునే టైమ్ లో ఇక సాధించలేదేమో అనే పరిస్ధితులు ఏర్పడతాయి. అప్పుడు శివుడు ఒక శక్తిని క్రియేట్ చేసి లక్ష్యం సాధించేలా చేస్తాడు.ఇది క్లుప్తంగా నాగభరణం కథ.
ఇందులో చనిపోయిన విష్ణువర్ధన్ ను గ్రాఫిక్స్ తో చూపించడం ఎలా అనిపించింది. ఆ ఆలోచన ఎలా వచ్చింది..?
విష్ణువర్ధన్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన నన్ను కన్నడ, తెలుగులో ఓ సినిమా చేయమన్నారు. రెండు నెలల్లో డేట్స్ ఫైనల్ చేస్తాను అన్నారు. దీంతో నేను స్ర్కిప్ట్ రాయడం కోసం బ్యాంకాక్ వెళ్లాను. నేను వచ్చేసరికి విష్ణువర్థన్ చనిపోయారు. ఈ వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే పాత్ర ఉంది. ఎవరితో చేద్దాం అని ఆలోచిస్తుంటే...మా నిర్మాతే విష్ణువర్ధన్ గారితో చేద్దాం అన్నారు. నాకు అర్ధం కాలేదు. ఆతర్వాత మకుట సంస్థ గురించి సాజిద్ గారు చెప్పారు. మకుట సంస్థ ఎంతోగానో శ్రమించి గ్రాఫిక్స్ తో విష్ణువర్ధన్ గారిని తెర పైకి తీసుకువచ్చింది. సాజిద్ సినిమా గురించి అందరూ చెప్పుకోవాలి అన్నారు ఆయన అన్నట్టుగానే జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
విష్ణువర్ధన్ పాత్ర ఎంత సేపు కనిపిస్తుంది..?
క్లైమాక్స్ లో 15 నిమిషాలు పాటు విష్ణువర్ధన్ పాత్ర కనిపిస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఓ ప్రయోగం. విష్ణువర్ధన్ గారి క్యారెక్టర్ ను ఆయన భార్య భారతికి చూపించనప్పుడు ఆయన్ని తెర పై ఆవిష్కరించినట్టే మా ఇంట్లోకి కూడా వచ్చేస్తే బాగున్ను అంటూ ఏడ్చేసారు.
మీరు గ్రాఫిక్స్ తో తీసిన సినిమాలను గ్రాఫిక్స్ లేకుండా కూడా తీయచ్చా..?
గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా అయినా తీయచ్చు. అయితే....అవతార్, టైటానిక్ సినిమాలతో ప్రపంచాన్ని చూసే ప్రేక్షకులకు గ్రాఫిక్స్ కావాలి. కంప్యూటర్ వచ్చాకా ఏదైనా చేయచ్చు. అయితే...గ్రాఫిక్స్ తో సినిమా చేయాలంటే భారీ బడ్జెట్ పెట్టే నిర్మాత కావాలి. అలాంటి గొప్ప నిర్మాత నాకు దొరకడం నా అదృష్టం.
వందకు పైగా సినిమాలు తీసారు...గ్రాఫిక్స్ తో సినిమాలు తీస్తూ నేటితరాన్నికూడా ఆకట్టుకుంటారు కదా...! అసలు మీరు ఎలా అప్ డేట్ అవుతుంటారు..?
కొత్త కెమెరా వచ్చింది అంటే...ఆ కెమెరాను తెప్పించి ఎలా వర్క్ చేస్తుందో చూస్తాను. పూర్తిగా తెలుసుకుంటాను. టెక్నిక్ పెరిగితే ప్రొడ్యూసర్ కి లాభం రావాలి. హెల్ప్ అవ్వాలి. అందుచేత గ్రాఫిక్స్ తో సినిమా చేయాలనుకుంటే దానిపై అవగాహన ఉండాలి. అలా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవడం వలనే ఇప్పటికి ప్రేక్షకులు నా చిత్రాలను ఆదరిస్తున్నారు.
గ్రాఫిక్స్ విషయంలో మీకు స్పూర్తి ఎవరు..?
అమ్మోరు టైమ్ లో గ్రాఫిక్స్ ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తెర పైకి తీసుకువచ్చారు. అమ్మోరు, అంజి సినిమా విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఆయనలో గ్రాఫిక్స్ పై ఉన్న ఇంట్రస్ట్ నాకు మరింత ఉత్సాహాన్ని అందించింది. గ్రాఫిక్స్ తో సినిమా తీసినా మన నేటివిటి మిస్ కాకూడదు. గ్రాఫిక్స్ ని, నేటివిటిని మిక్స్ చేసి తీస్తేనే సక్సెస్ సాధిస్తాం అని నేను బలంగా నమ్ముతాను. అమ్మోరు, దేవి, దేవుళ్లు, అంజి, అరుంధతి, నేడు నాగభరణం..ఇలా గ్రాఫిక్స్ తో నా ప్రయాణం కొనసాగుతుంది.
బాహుబలి సినిమా చూసారా మీకు ఏమనిపించింది..?
బాహుబలి గ్రేట్ వర్క్. అయితే నేను బాహుబలి విషయంలో ఫస్ట్ మార్క్ ప్రొడ్యూసర్ కే ఇస్తాను. రాజమౌళి టాలెంట్ గురించి చెప్పాలంటే... నేను ఈగ సినిమా విషయంలో రాజమౌళిని అభినందిస్తాను. ఈగతో ఆవిధంగా సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈగ టైమ్ లోనే రాజమౌళికి పద్మశ్రీ వచ్చుండాల్సింది..!
బాలకృష్ణతో గతంలో ఓ సినిమా ప్రారంభించారు కదా...?
ఈ సినిమా 60% షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా ఎందుకు ఆగిందో తెలియదు. గోపాల్ రెడ్డి గారి అబ్బాయి ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాని పూర్తి చేస్తాం.
పుట్టపర్తి సాయిబాబా జీవితకథ ఆధారంగా చేస్తున్న సినిమా ఎంత వరకు వచ్చింది..?
40% షూటింగ్ పూర్తయ్యింది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందులో 14 పాటలు ఉన్నాయి. ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments