సంతకం పెట్టకుంటే తిరుమల అపవిత్రమవుతుందా?: కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమలలో డిక్లరేషన్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క తిరుమలనే కాకుండా ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన అన్ని దేవాలయాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ డిక్లరేషన్ అడగలేదని పేర్కొన్నారు. సీఎం హోదాలో వెళ్లే వ్యక్తికి డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్నారు. హిందువులకు తాము ఛాంపియన్లమని చెప్పేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన యత్నిస్తున్నాయని కొడాలి నాని ఆరోపించారు.
ఏ గుడికి, చర్చికి, మసీదుకి లేని డిక్లరేషన్ తిరుమల వేంకటేశ్వరుని దేవస్థానానికి మాత్రం ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాలని లేదంటే దానిని తీసివేయాలన్నారు. డిక్లరేషన్ ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎవరిని అడిగి పెట్టారు?.. దానిపై చర్చ జరగాలన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘వేరే మతం వాళ్లు సంతకం పెట్టకుండా వెళితే దాని పవిత్రత దెబ్బ తింటుందనా? ఆచారం అంటే ఏంటి? వేరే మతం వాళ్లు వేంకటేశ్వర స్వామిని నమ్మి.. ఆ గుడికి వెళ్ళి.. సంతకం పెట్టకుంటే ఆ గుడి అపవిత్రమై పోతుందా? వేంకటేశ్వర స్వామికేమైనా అపచారం జరుగుతుందా?
నేను మనసులో వేంకటేశ్వరస్వామిని నమ్ముకుని.. సంతకం పెట్టకుండా గుడిలోకి వెళితే గుడి మొత్తం అపవిత్రమై పోతుందా? హిందువులు సంతకం పెట్టకుండా వెళితే ఆ గుడి అంతా పవిత్రంగా ఉంటుందా? ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఆంజనేయ స్వామి చెయ్యి విరగ్గొడితే.. ఆయనకు పోయేదేం లేదు. అలాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏం లేదు. 10 కేజీల వెండి ఎత్తుకు పోయినా ఆరు లక్షలో.. ఏడు లక్షలో.. దాంతో మేడలు.. మిద్దెలు కట్టేదేం లేదు. అంతర్వేదిలో కోటి రూపాయల రథాన్ని తగులబెడితే ప్రభుత్వం రథాన్ని చేయిస్తుంది. దాని వల్ల దేవుడికి పోయేదేం లేదు’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments