నిమ్మగడ్డ రమేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
- IndiaGlitz, [Wednesday,November 18 2020]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన రమేష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గు లేకుండా, టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖలకు స్పందించి ఎన్నికలను నిర్వహించాలను కోవడం సిగ్గుచేటని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
కోవిడ్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఎన్నికల విధుల్లో పాల్గొనేందు సిద్ధంగా లేరని కొడాలి నాని పేర్కొన్నారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నా నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలని కొడాలి నాని సూచించారు. ప్రస్తుత కోవిడ్ తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం మరింత వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని కొడాలి నాని పేర్కొన్నారు.
వయసు వచ్చినా బుద్ధీ జ్ఞానం లేకుండా కోవిడ్ కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషనర్ ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమన్నారు. హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ కుమార్, జూమ్ బాబు ఇద్దరూ కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని కొడాలి నాని హెచ్చరించారు.