Kodali Nani:నాకు క్యాన్సర్ లేదు.. చంద్రబాబును ఇంటికి పంపేవరకు భూమ్మీదే వుంటా : ఆరోగ్యంపై కొడాలి నాని క్లారిటీ
- IndiaGlitz, [Wednesday,July 12 2023]
తాను క్యాన్సర్ బారినపడ్డానంటూ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. మంగళవారం ఓ కేసు వాయిదా నిమిత్త విజయవాడలోని కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన అనారోగ్యంపై వస్తున్న కథనాలను ఖండించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయుడును రాజకీయాల నుంచి ఇంటికి పంపేవరకు తాను ఈ భూమ్మీదే వుంటానని నాని తేల్చిచెప్పారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ మానసిక వికలాంగులని.. వాళ్లని పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ సీఎంను కోరుకున్నట్లు కొడాలి నాని తెలిపారు. 2024 ఎన్నికల తర్వాత వాళ్లిద్దరిని పిచ్చాసుపత్రిలో చేరుస్తానంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌కు దమ్ముంటే తనపై పోటీకి దిగాలని కొడాలి నాని సవాల్ విసిరారు.
కాగా కొడాలి నాని క్యాన్సర్ బారినపడ్డారని.. కొద్దిరోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో కొడాలి నాని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు ఈ వార్తలను ఖండించారు కూడా. కొడాలి నాని పూర్తి ఆరోగ్యంతో వున్నారని.. కొండాలమ్మ అమ్మవారికి ఆషాడం సారె కూడా అందించారని తెలిపారు. విదేశాల నుంచి బంధువులు రావడంతో వాళ్లని రిసీవ్ చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్లారని నేతలు తెలిపారు.