Chandrababu, Balakrishna Assets: చంద్రబాబు, బాలకృష్ణ ఆస్తులు ఎంతో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి తొలిసారి కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో కుమారుడు లోకేశ్ నామినేషన్ దాఖలు చేయగా 2019 ఎన్నికల్లో స్థానిక నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో కంటే ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయి. 2019 అఫిడవిట్‌లో చంద్రబాబు, భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.545 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 40శాతం పెరిగి రూ.931 కోట్లకు చేరుకుంది.
నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు కాగా రూ. 2,22,500 విలువైన అంబాసిడర్ కారు ఉంది. అలాగే రూ.36.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లోని 2.26 కోట్ల షేర్లు విలువ రూ.763.93 కోట్లుగా ఉంది. బంగారం, ఇతర ఆభరణాలు విలువ దాదాపు కోటిన్నర ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్‌లో రూ.85.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇటు అప్పుల విషయానికొస్తే కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. భువనేశ్వరికి రూ.6.83 కోట్లు అప్పుడు ఉండగా లోకేశ్ నుంచే రూ.1.27 కోట్లు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 2019కు ముందు చంద్రబాబుపై కేవలం రెండే కేసులు ఉండగా ఈ ఐదేళ్లలో ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. ఇందులో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన కేసులే ఏకంగా 8 ఉన్నాయి. అంతేకాకుండా అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండేసి చొప్పున, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఇక నందమూరి బాలకృష్ణ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.81.63 కోట్లుగా ఉంది. భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38లక్షల 83వేలుగా పేర్కొన్నారు. ఇక ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63లక్షల 66వేలుగా ఉంది. అటు అప్పులకు సంబంధించి బాలకృష్ణకు రూ.9 కోట్లు 9 లక్షల 22 వేలు.. వసుంధరకు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలు అప్పులు ఉన్నట్లు చూపించారు. కాగా బాలకృష్ణ మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments