KL Damodar Prasad:తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్.. దిల్‌రాజుదే పైచేయి
- IndiaGlitz, [Monday,February 20 2023]
టాలీవుడ్లో ఉత్కంఠ రేపిన నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి జెమిని కిరణ్‌పై 15 ఓట్ల తేడాతో దామోదర్ విజయం సాధించారు. కిరణ్‌కు 315 ఓట్లు, దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా సుప్రియ, కె. అశోక్ కుమార్.. ట్రెజరర్‌గా రామ సత్యన్నారాయణ , సెక్రటరీగా టీ ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరి, నట్టి కుమార్ విజయం సాధించారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా దిల్‌రాజు, డీవీవీ దానయ్య, పీవీ రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, ఎన్ పద్మిని, బీ వేణుగోపాల్, వై సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, ఠాగూర్ మధు, కేశవరావు, శ్రీనివాసరావు వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, ప్రతాని రామకృష్ణ గౌడ్, పూసల కిశోర్ ఎన్నికయ్యారు.
ఎన్నికలకు ముందు మాటల యుద్ధం :
కాగా.. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మొత్తం 1200 ఓట్లు వుండగా.. సి కళ్యాణ్ నేతృత్వంలోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానెల్.. దిల్‌రాజు వర్గంగా వున్న ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ పోటీపడ్డాయి. ఎన్నికలకు ముందు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఇదే సమయంలో దిల్‌రాజు సైతం తమ వర్గాన్ని గెలిపించుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. టీవీలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఉత్కంఠ నడుమ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ఆదివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్మాతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు.