Kitchcha Sudeep: సమంతకు మయోసైటిస్ .. ఫోన్ చేసి కూడా పలకరించలేదు, ఎందుకంటే : సుదీప్
- IndiaGlitz, [Monday,January 02 2023]
వెరైటీ కథలు, వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తారు కన్నడ స్టార్ హీరో సుదీప్ (Sudeepa). హిట్టూ, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్టైల్. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది కాసేపైనా ఆకట్టుకున్నాడు. ఆ క్రేజ్‌తో ఇప్పుడు సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఈ ఏడాది విక్రాంత్ రోణ (Vikrant Rona)తో ఆయన తెలుగు వారిని కూడా పలకరించారు. ఈ మూవీలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు.
ఈగలో కలిసి నటించిన సమంత (Samantha), సుదీప్ (Sudeep):
తాజాగా ప్రముఖ వెబ్‌సైట్ indiaglitzకు సుదీప్ (Kitchcha Sudeep) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సంగతులు, వ్యక్తిగత విషయాలు తోటి నటీనటుల గురించి సుదీప్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అగ్ర కథానాయిక సమంత గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరూ కలిసి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో నటించారు. అందులో సమంత హీరోయిన్‌గా నటించగా.. సుదీప్ విలన్ పాత్ర పోషించారు.
సమంత చాలా స్ట్రాంగ్:
ఇక .. సమంత (Samantha Ruth Prabhu) గురించి చెబుతూ.. ఆమె అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోందని సినిమా సెట్, షూటింగ్ సమయాల్లో కాస్త భయపడేదని సుదీప్ తెలిపారు. ఆమె చాలా హార్డ్ వర్కర్ అని, సినిమా షూటింగ్ జరిగినంతకాలం ఇద్దరం అంతగా మాట్లాడుకోలేదని సుదీప్ (Sudeep) గుర్తుచేసుకున్నారు. ఈగ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడంతో ఒక షాట్ ముగిసిన వెంటనే మరో షాట్ వుండేదని ఆయన తెలిపారు. దీనికి తోడు సినిమాలో కీలకపాత్ర కావడంతో తనపై బరువు, బాధ్యతలు ఎక్కువగా వుండేవని.. దీంతో తాను డైలాగ్స్ చదువుకోవడమే సరిపోయిందని సుదీప్ పేర్కొన్నారు. సమంత ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అని ఆయన ప్రశంసించారు.
సమంతకు ఫోన్ కూడా చేయలేదు:
అయితే సమంత (Samantha) మయోసైటిస్ బారినపడటంతో ఫోన్ చేసి పరామర్శించారా అని యాంకర్ ప్రశ్నించగా.. తనకు స్వతహాగా ఎవ్వరికీ ఫోన్ చేయడం ఇష్టం వుండదని సుదీప్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరి హద్దులు వారి కుంటాయని, వాళ్ల ప్రైవసీని డిస్ట్రబ్ చేయడం తనకు ఇష్టముండదని ఆయన పేర్కొన్నారు. అయితే రెండు మూడు సార్లు తాను సమంతను కలిశామని.. అప్పుడు ఆమె హలో అని నవ్వుతూ పలకరించేదని సుదీప్ తెలిపారు. జీవితంలో ఎదురైన ఈ ఇబ్బందుల నుంచి సమంత బయటపడాలని ఆయన ఆకాంక్షించారు.