బీజేపీలోకి మాజీ ఎంఐఎం నేత.. ఆహ్వానించిన కిషన్ రెడ్డి..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం అవసరమైన ప్రతి చిన్న అవకాశాన్ని పార్టీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రిచెస్ట్ నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ స్థానంపై బీజేపీ కన్ను పడింది. ఆ స్థానంలో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరపున లంకెల దీపక్ రెడ్డి బరిలో దిగారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మె్ల్యే మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఇక ఈసారి కొత్తగా ఎంఐఎం పార్టీ తరపున మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ రంగంలోకి దిగారు.
అయితే ఈ స్థానం నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గట్టి పట్టున్న స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40 నిమిషాల పాటు ఇరువురు ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీపై కిషన్ రెడ్డి స్పందిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలను కలుస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే శ్రీశైలం యాదవ్‌ను కలిసినట్లు స్పష్టం చేశారు. ఇదే అంశంపై శ్రీశైలం యాదవ్ సైతం స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని వెల్లడించారు. పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం కాలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ నవీన్ యాదవ్‌ను బీజేపీలోకి రావాలంటూ కిషన్ రెడ్డి ఆహ్వానించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున బరిలో నిలిచిన నవీన్ కుమార్ యాదవ్ 41,656 ఓట్లు సాధించారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు 18,817 ఓట్లు పోలయ్యాయి. ఈసారి కూడా ఇండింపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ నవీన్ యాదవ్‌ను తమ పార్టీలో చేర్చుకుంటే ఆయనకు వచ్చే ఓట్లు తమకు ప్లస్ అవుతాయని కమలం పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు రేపు(బుధవారం) చివరి రోజు కావడంతో ఆయనను పోటీ నుంచి తప్పుకునేలా కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ నవీన్ పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు ఇస్తే కచ్చితంగా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments