Download App

Kirrak Party Review

హ్యాపీడేస్ చిత్రంలో న‌లుగురు కుర్రాళ్ల‌లో ఒక‌డిగా ప‌రిచ‌య‌మైన హీరో నిఖిల్ త‌ర్వాత యువ‌త‌తో హీరోగా మంచి స‌క్సెస్‌ను అందుకున్నాడు. త‌ర్వాత నిఖిల్ స‌క్సెస్ కోసం స్వామిరారా వ‌ర‌కు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. త‌ర్వాత కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌, ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా, కేశ‌వ అంటూ మంచి విజ‌యాల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్‌. అయితే హ్యాపీడేస్ త‌ర్వాత నిఖిల్ చేసిన పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ `కిరాక్ పార్టీ`. క‌న్న‌డంలో ఘ‌న విజ‌యం సాధించిన `కిర్రిక్ పార్టీ`కి ఇది రీమేక్‌. మ‌రి తెలుగ‌లో రీమేక్ అయిన 'కిరాక్ పార్టీ'  ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

కృష్ణ‌( నిఖిల్ సిద్ధార్థ్‌) అనే యువ‌కుడి కాలేజీ జీవిత‌మే కిరాక్ పార్టీ. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో జాయిన్ అయిన కృష్ణకు అక్క‌డ ప‌రిచ‌మైయే స్నేహితులతో ( రాకేందు మౌళి, హేమంత్ త‌దిత‌రులు) కాలేజీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. సీనియ‌ర్ అమ్మాయి మీరా(సిమ్రాన్‌)ని కృష్ణ ఇష్ట‌ప‌డ‌టంతో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి.  ఆ గొడ‌వ‌ల్లో సీనియ‌ర్స్‌ను కొట్టిన కృష్ణ అండ్ గ్యాంగ్ కాలేజ్ నుండి స‌స్పెండ్ అవుతారు. మీరాకి ద‌గ్గ‌ర‌వ‌డానికి కృష్ణ చాలా ప్ర‌య‌త్నాలే చేస్తాడు. చివ‌ర‌కు మీరాకు కృష్ణ అంటే ఇష్టం కలుగుతుంది. అయితే ప్ర‌మాద‌వ‌శాతు మీరా చ‌నిపోతుంది. దాంతో అప్ప‌టి వ‌ర‌కు న‌వ్వుతూ ఉండే  కృష్ణకు సీరియ‌స్ అయిపోతాడు. త‌న స్నేహితుల‌తో కూడా గొడ‌వ ప‌డ‌తారు. స్నేహితులు రెండు గ్రూపుల‌వుతారు. కాలేజీ గొడ‌వ‌లు.. ఎల‌క్ష‌న్స్ ఇలా సాగుతున్న కృష్ణ జీవితంలోకి జూనియ‌ర్ అమ్మాయి స‌త్య‌(సంయుక్తా హెగ్డే) ఎంట్రీ ఇస్తుంది. కృష్ణ‌ను ఇష్ట‌ప‌డ్డ సత్య అత‌న్ని ఎలా మారుస్తుంద‌నేదే సినిమా? అదెలాగో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

- నిఖిల్ న‌ట‌న‌
- అక్క‌డ‌క్క‌డా క‌నెక్ట్ అయ్యే కాలేజీ స‌న్నివేశాలు
- క్లైమాక్స్‌

మైన‌స్ పాయింట్స్‌:

- సినిమా సెకండాఫ్ సాగ‌దీత‌గా అనిపించ‌డం
- ఎమోష‌న్స్ ఉన్నా.. అవి మ‌రింత బ‌లంగా ఉండాల‌నిపించడం
- కామెడీ ఉంది .. విర‌గ‌బ‌డి న‌వ్వేంత కామెడీ లేదు.

విశ్లేష‌ణ‌:

సినిమా ఫస్టాఫ్ అంతా కాలేజీ గొడ‌వ‌లు.. కాలేజీ విద్యార్థ‌లు మందు కొట్ట‌డం. సిగ‌రెట్ త్రాగ‌డం.. అమ్మాయిల వెంట‌ప‌డ‌టం సీనియ‌ర్స్‌తో గొడ‌వ‌లు.. కాలేజీ నుండి స‌స్పెండ్ అవ‌డం.. స్నేహితులంద‌రూ క‌లిసి ఓ కారు కొని దాంట్లో షికార్లు కొట్ట‌డం. వ‌ర‌కు సన్నివేశాలు ఇత‌ర సినిమాల్లో చూసిన‌ట్లు అనిపిస్తాయి. కొన్ని సీన్స్‌మాత్రం ఆక‌ట్ట‌కుంటాయి. ఇక హీరోయిన్‌ను ప‌డేయ‌డానికి హీరో ఆమె ఇంటి ముందు చ‌క్క‌ర్లు కొట్ట‌డం. ముందు అంత‌గా ప‌ట్టించుకోని హీరోయిన్ త‌ర్వాత హీరో ప్రేమ‌లో ప‌డ‌టం.. అయితే హీరోయిన్ చ‌నిపోవ‌డంతో ఫ‌స్టాఫ్ ముగుస్తుంది. హీరోయిన్ చనిపోవ‌డం అనేదే చిన్న మెళిక‌. ఇదే ఫ‌స్టాఫ్‌లో హీరోయిన్ సిమ్రాన్‌తో క‌లిసి ఓ వ్యభిచారం చేసే అమ్మాయికి హీరో సాయ‌ప‌డతాడు . ఇక సెకండాఫ్‌లో నిఖిల్ పూర్తిగా గ‌డ్డం ఉండే లుక్లో సీరియ‌స్‌గా క‌న‌ప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి లుక్లో నిఖిల్‌ను చూసి ఉండ‌రు.  ఎప్పుడైతే సెకండ్ హీరోయిన్ సంయుక్తా హెగ్డే ఎంట్రీ అవుతుందో అక్క‌డ‌.. క‌థ ప్రేక్ష‌కుడి అర్థ‌మైపోతుంది. ఆ క్ర‌మంలో  సీరియ‌స్‌గా ఉండే హీరోను త‌ను ఎలా మార్చుకుంద‌నేదే క‌థ‌. హీరో ఎగ్జామ్స్ పేప‌ర్స్‌ను దొంగ‌త‌నం చేసి కాపీ కొట్ట‌డం.. ప్రిన్సిపాల్‌ను కిడ్నాప్ చేయ‌డం.. చివ‌ర‌కు మారిపోయిన హీరో త‌న ప్రేమ‌ను హీరోయిన్‌కు చెప్పాల‌నుకుని రాసిన లెట‌ర్‌ను ప్రిన్సిపాల్‌కు.. ప్రిన్సిపాల్‌కు రాసిన క్ష‌మాప‌ణ లెట‌ర్‌ను అమ్మాయికి ఇవ్వ‌డంతో చిన్న స్మైల్‌తో  సినిమా ముగుస్తుంది. సిమ్రాన్ డీసెంట్‌గా, సింపుల్‌గా క‌న‌ప‌డితే.. సంయుక్తా ఫుల్ ఎన‌ర్జిటిక్ పాత్ర‌లో క‌న‌ప‌డింది. ఇక హేమంత్‌, రాకేందు మౌళి, సిజ్జు స‌హా మిగిలిన తారాగ‌ణమంతా వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. హీరో క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గానే డిజైన్ చేశారు. అలాగే సినిమాను యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చూసుకున్నారు. ఈ కాన్సెప్ట్ సినిమాలు చాలానే వ‌చ్చాయి. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర‌లో నిఖిల్ చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా నార్మ‌ల్ లుక్‌, గ‌డ్డం ఉన్న లుక్‌లో నిఖిల్ మంచి వేరియేష‌న్ చూపించాడు. హీరోయిన్‌.. హీరోను ఓ బంగ్లాలోకి తీసుకెళ్ల‌డం... అక్క‌డ నుండి దెయ్యాల‌కు భ‌య‌ప‌డి పారిపోవ‌డం వంటి కొన్ని సీన్స్ సినిమా ల్యాగ్‌ను పెంచాయే కానీ.. మ‌రేం ఉప‌యోగం క‌న‌ప‌డ‌దు. ముఖ్యంగా సెకండాఫ్ సాగ‌దీసిన‌ట్లుగా అనిపించ‌డానికి ఇలాంటి సన్నివేశాలు కూడా కార‌ణ‌మే.

ఓ ఏజ్ గ్రూప్‌వారికి వారి కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి. సాంకేతికంగా చూస్తే...ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. అయితే ఇందులో త‌ను కొత్త‌గా చేసిందేమీ లేద‌నిపించింది. ఎందుకంటే చందు మొండేటి మాట‌లు, సుధీర్ వ‌ర్మ స్క్రీన్‌ప్లే త‌న‌కు హెల్ప్ అయ్యాయి. ఇక అజ‌నీశ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. అద్వైత గుర్తుమూర్తి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ముఖ్యంగా పాట‌ల్లోని సన్నివేశాల‌ను ఎలివేట్ చేసిన తీరు బావుంది. ఎం.ఆర్‌.వ‌ర్మ సినిమాలో కొన్ని అన‌వ‌స‌ర సన్నివేశాల‌ను తొలగించి ఉంటే బావుండేది.

చివ‌ర‌గా.. 'కిరాక్ పార్టీ'... యూత్ ఆడియెన్స్‌కే

Kirrak Party Movie Review in English

Rating : 2.8 / 5.0