Kirak RP:నా ఎదుగుదల ఓర్వలేకపోతున్నారు.. నా బిజినెస్‌పై పెయిడ్ బ్యాచ్ కుట్ర : కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Tuesday,February 07 2023]
కిర్రాక్ ఆర్పీ.. అలియాస్ జబర్దస్ ఆర్పీ.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో వుండరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్పీ.. తర్వాత తన ప్రతిభతో మంచి స్థాయికి చేరుకున్నాడు. నెల్లూరు యాసతో, తనదైన ప్రాసలతో ఆర్పీ చేసే అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా త్వరగానే టీమ్ లీడర్ దాకా ఎదిగి తనలాంటి ఎంతోమందికి అవకాశం కల్పించాడు. అయితే జబర్దస్త్‌లోని తోటి నటీనటుల మాదిరిగానే ఆర్పీ కూడా దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని బాగా వంటబెట్టించుకున్నాడు. దీనిలో భాగంగానే ఓవైపు జబర్దస్త్‌లో షోలు చేస్తూనే.. మరోవైపు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన స్వస్థలం నెల్లూరు ప్రాంతంలో మంచి గుర్తింపు వున్న చేపల పులుసును హైదరాబాద్ వాసులకు అందించాలని నిర్ణయించుకున్నాడు.
హైదరాబాద్ వాసులకు నెల్లూరు చేపల పులుసు :
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. దీనికి మంచి పబ్లిసిటీ రావడంతో పాటు రుచి కూడా బాగుండటంతో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనం తాకిడితో ఇటీవల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు సైతం రావడంతో తాత్కాలికంగా కర్రీ పాయింట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. పరిస్ధితి చక్కబడిన తర్వాత కర్రీ పాయింట్‌ను తిరిగి ఓపెన్ చేశాడు.
అంతా పెయిడ్ బ్యాచ్ పనే:
ఈ క్రమంలో తన స్టోర్‌లో చేపల పులుసు రుచి బాగాలేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆర్పీ మండిపడ్డాడు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఇదంతా చేస్తున్నారని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చానని.. ఎవరిని మోసం చేయలేదని, ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని ఆర్పీ తెలిపాడు. కస్టమర్లు సైతం రుచి బాగుండటంతో మరికొందరికి తన కర్రీ పాయింట్‌ను పరిచయం చేస్తున్నారని చెప్పాడు. రుచి బాగోకుంటే తన వద్దకు ఎవరూ రారు కదా అని ప్రశ్నించాడు. ఇంతమంది బాగుంది అంటే.. ఒక్కడు మాత్రం నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, తాను నా కిచెన్ గురించి పలుమార్లు వీడియోలు చేశానని ఆర్పీ గుర్తుచేశాడు. తనను ఎంత నెగిటివ్ చేస్తే.. తనకు అంత ప్రమోషన్ అనీ ఆర్పీ కుండబద్ధలు కొట్టాడు.