జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరు: కిల్లి
- IndiaGlitz, [Tuesday,February 19 2019]
వైసీపీలోకి రోజురోజుకు వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగువెలిగిన, మంత్రులుగా పనిచేసిన కీలకనేతలంతా జగన్ సమక్షంలో పార్టీలో చేరతున్నారు. కాగా త్వరలోనే మరికొంతమంది సిట్టింగ్‌లు, కీలకనేతలు వైసీపీలో చేరతారని సమాచారం. ఇదిలా ఉంటే రెండ్రోజుల్లో ఎవరొచ్చినా వైసీపీలో చేర్చుకుంటామని ఆ తర్వాత కష్టమని వైఎస్ జగన్ పరోక్షంగా నేతలతో సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది.
తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలకనేత కిల్లి కృపారాణి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్‌ను కలిశారు. లోటస్‌పాండ్‌లో సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో సీటు విషయం, తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించినట్లు తెలిసింది. కాగా ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కిల్లికి శ్రీకాకుళం టికెట్ ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వైఎస్ జగన్ మాట తప్పరు.. బేషరతుగా వైసీపీలోకి..
వైఎస్ జగన్ మాట తప్పరని, మడమ తిప్పని నేత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేక ఆ పార్టీకి రాజీనామా చేశాను. జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. మళ్లీ రాజన్న రాజ్యం జగన్‌తోనే వస్తుంది. అందుకే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ నెల 28న అమరావతిలో జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. టికెట్ ఆశించి వైసీపీలోకి రాలేదు.. బేషరుతగా వైసీపీలో చేరుతున్నాను. బీసీ గర్జనలో జగన్ ఇచ్చిన హామీలు నచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ పొత్తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయమై నేను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశాను. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారు. బీసీలను, కులవృత్తుల వారిని వాడుకొని చంద్రబాబు వదిలేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలు విశ్వసించరు అని కృపారాణి చెప్పుకొచ్చారు.