Killer Review
విజయ్ ఆంటోని... ఈ పేరు వినగానే తెలుగు సినీ ప్రేక్షకుడికి టక్కున గుర్తుకొచ్చే పేరు 'బిచ్చగాడు'. 'పిచ్చైకారన్' అనే తమిళ సినిమాను తెలుగులో 'బిచ్చగాడు'గా అనువదించి తిరుగులేని సక్సెస్‌నే కాదు.. తన కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. అయితే తర్వాత విజయ్ ఆంటోని నటించిన చిత్రాలు చాలానే విడుదలయ్యాయి. కానీ ఏవీ ఈ హీరోకు అనుకున్న స్థాయిలో సక్సెస్‌ను మాత్రం ఇవ్వలేకపోయాయి. అయితే విజయ్ ఆంటోని తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. తన ప్రయత్నాల్లో భాగంగా విజయ్ ఆంటోని తాను చేసిన 'కొలైగారన్' సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా 'కిల్లర్' అనే పేరుతో విడుదల చేస్తున్నాడు. మరి కిల్లర్ విజయ్ ఆంటోనికి ఎలా విజయాన్ని అందించింది?. కిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం.
కథ:
ప్రభాకర్(విజయ్ ఆంటోని) ఓ హత్య చేసినట్లుగా ఒప్పుకుని అరెస్ట్ అవుతాడు. కేసుని దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్ కార్తికేయ(అర్జున్)కి ప్రభాకర్ తన గతాన్ని చెప్పడంతో సినిమా అసలు కథ ప్రారంభం అవుతుంది. ప్రభాకర్, జయంతి(ఆషీమా నర్వాల్) ఎదురెదురు ఫ్లాట్స్‌లో ఉంటారు. జయంతిని ఆమెకు తెలియకుండా ప్రభాకర్ ఫాలో అవుతూ ఉంటాడు. ఆమెకు మినిష్టర్ తమ్ముడు విష్ణు వల్ల ఇబ్బంది అని తెలుసుకుంటాడు. ఓరోజు కార్తికేయకు భీమిలి బీచ్ రోడ్డులో ఓ గుర్తు తెలియని శవం ఉందని తెలుస్తుంది. అక్కడకు వెళ్లి చూస్తాడు. అది మినిష్టర్ తమ్ముడు విష్ణు శవం అని నిర్ధారణకు వస్తారు. కార్తికేయ సీరియస్‌గా కేసును దర్యాప్తు చేసి జయంతి ఇంటికి వరకు వెళతాడు. అదే సమయంలో ఎదురింట్లో ఉంటున్న ప్రభాకర్‌ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. క్రమంగా కేసు బిగుసుకుంటున్న తరుణంలో జయంతి తన లవర్ అని.. ఆమె కోసమే తాను హత్య చేశానని చెబుతాడు ప్రభాకర్. అందరూ కేసు ముగిసిందని భావిస్తారు. కానీ కార్తికేయ కేసును మరింత లోతుగా స్టడీ చేసే సమయంలో కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? అసలు ప్రభాకర్ ఎవరు? అతను విష్ణుని ఎందుకు చంపుతాడు? జయంతి నిజంగానే ప్రభాకర్ లవరా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలంటే దర్శకుడు కథ, కథనం.. పాత్రలను పోషించే నటీనటుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దర్శకుడు అండ్రూ లూయీస్ ఆ విషయంలో పెద్ద సక్సెస్ అయ్యాడని చెప్పాడని.. ప్రారంభంలో స్రీన్ ప్లే, కన్‌ఫ్యూజింగ్ తీసుకెళ్లాడు. కొన్ని సన్నివేశాలను మధ్య మధ్యలో సస్పెన్స్‌తో అలాగే వదిలేశాడు. ఆ సన్నివేశాలన్నింటికీ చివర్లో ముగింపు చెప్పుకుంటూ వచ్చాడు. సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణ గ్రిప్పింగ్‌గా ఉంది. దర్శకుడికి ముఖేష్ కెమెరా వర్క్, సైమన్ కింగ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని ఇచ్చింది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ బావుంది. నటీనటుల విషయానికి వస్తే.. కెరీర్ ప్రారంభంలో నకిలీ, డా.సలీమ్ చిత్రాల్లో సీరియస్ పాత్రల్లో విజయ్ ఆంటోని నటించాడు. తర్వాత ఆ రేంజ్‌లో పాత్రలు కుదరలేదు. చాలా గ్యాప్ తర్వాత విజయ్ ఆంటోని మంచి సీరియస్ పాత్ర దొరికిందనే చెప్పాలి. అలాగే అర్జున్ పాత్రను చూస్తే ఆయన చాలా సింపుల్‌గా తన పాత్రను క్యారీ చేశారు. ఇక ఆషిమా నర్వాల్, నాజర్, సీత సహా ఇతర పాత్రలు వాటి వాటి పరిధుల మేర చక్కగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు మనకు దృశ్యం సినిమా గుర్తుకు వస్తుంది.
బోటమ్ లైన్: పగ, ప్రతీకారాల కిల్లర్..ఓ ఎంగేజింగ్ థ్రిల్లర్
Read Killer Movie Review in English
- Read in English