Khushbu:రోజాపై బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఖుష్భూ.. క్షమాపణలు చెప్పే వరకు పోరాటం చేస్తా
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధిపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తక్షణమే బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోజాకు క్షమాపణలు చెప్పే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బండారు రాజకీయ నాయకుడిగానే కాదు.. మనిషిగా కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. ఓ స్నేహితురాలిగా కాకుండా సాటి మహిళగా రోజాకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు.
నారీ శక్తి వంటి చట్టాలు తెచ్చుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు దారుణం..
దేశంలో నారీ శక్తి వంటి చట్టాలను తెచ్చుకుంటున్నామని.. మహిళ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రధాని మోదీ తెచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్లు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని ఫైర్ అయ్యారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడటం వారి మానసిక దౌర్భల్యానికి నిదర్శనం అన్నారు. బండారు లాంటి వ్యక్తులు మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా గెలవడం ప్రజల దురుదృష్టం అంటూ ఖుష్భూ పేర్కొన్నారు. రోజా గురించి ఇంత దారుణంగా మాట్లాడిన బండారు తన నియోజకవర్గ మహిళలను కూడా అవమానించినట్లే అంటూ మండిపడ్డారు.
బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నటి కవిత, సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్..
కాగా రోజాపై బండారు వ్యాఖ్యలను సీనియర్ నటి కవిత, సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దివంగత మాజీ ముఖ్యమంత్రి స్థాపించిన పార్టీలోని నాయకులు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడటం సిగ్గు చేటని కవిత మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి రోజా పట్ల టీడీపీ నేతలు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమని ఉమా సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బండారు సత్యనారాయణ రోజాతో పాటు మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments