Khammam district:అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా యువకుడు మృతి
- IndiaGlitz, [Wednesday,November 08 2023]
విదేశాల్లో ఉన్నత చదువులు చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉంటారు. భవిష్యత్‌పై కోటి ఆశలతో సప్తసముద్రాలు దాటి విదేశాలకు వెళ్తుంటారు. అంతా బాగుందనుకునే సమయంలో విధి వక్రీకరిస్తే ఒక్కసారిగా జీవితం తలకిందలవుతుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు పడే కడుపుకోత వర్ణనాతీతం. ఓ తెలుగు విద్యార్థి విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
రామ్మూర్తి కుమారుడు వరుణ్ రాజ్(29) ఉన్నతచదువుల కోసం అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. గత నెల అక్టోబర్ 31న జిమ్ నుంచి బయటకు వస్తుండగా ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వరుణ్.. రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని ఆస్ప త్రికి తరలించారు.
అప్పటి నుంచి లూథరన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతడు కోమాలోకి వెళ్లాడు. అయితే బుధవారం ఉదయం యువకుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వరుణ్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడు ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియరాలేదు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.