Download App

Khakee Review

పోలీస్‌..పేరులో ప‌వ‌ర్ ఉంటుంది. స‌మాజం ప్ర‌శాంతం ఉండ‌టానికి ..ఎంతో మంది నిజాయితీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్స్ వారి కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసి డ్యూటీ చేయ‌డ‌మే కార‌ణం. ఇక సినిమాల్లో పోలీస్ అంటే సూప‌ర్ ప‌వ‌ర్‌తో  పై అధికారుల‌ను కూడా లెక్క చేయ‌కుండా ఏదేదో చేసేస్తుంటారు. కానీ నిజ జీవితంలో పోలీస్ ఉద్యోగం అలా ఉండ‌దు. ఆడ్మినిస్ట్రేష‌న్‌లో వారు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు ఎన్నో. అలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొని వారు క్లిష్ట‌త‌ర‌మైన కేసులను సాల్వ్ చేస్తుంటారు. ఓ కేసును పోలీసులు సాల్వ్ చేసిన విధానం మాత్ర‌మే మ‌న‌కు తెర‌పై క‌న‌ప‌డుతుంది కానీ..దాని వెనుక పోలీస్ డిపార్ట్‌మెంట్ క‌ష్ట‌మెంతో ఉంటుంది. పన్నెండేళ్ల క్రితం పెద్ద టెక్నిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ లేన‌ప్పుడు..త‌మిళ‌నాడు పోలీసులు దోపీడీ హ‌త్య కేసును చాక‌చ‌క్యంగా చేధించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కార్తి హీరోగా వినోద్ తెర‌కెక్కించిన సినిమాయే ఖాకి. అస‌లు ఈ ఖాకి ప‌వ‌రేంటో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ:

ధీర‌జ్ హ‌రిప్ర‌సాద్‌(కార్తి) ఓ క్లిష్ట‌మైన కేసును డీల్ చేసిన తీరును చూసిన ఓ పోలీసు అధికారి అత‌నికి ఫోన్ చేయ‌డంతో అస‌లు క‌థ మొద‌లవుతుంది. ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ట్ర‌యినింగ్ పూర్తి చేసుకున్న ధీర‌జ్ సెల‌వుల‌పై ఊరికెళ‌తాడు. త‌న ఎదురింట్లో ఉండే ప్రియ(ర‌కుల్ ప్రీత్ సింగ్‌)ను చూసి ఇష్ట‌ప‌డి ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. సిన్సియ‌ర్‌గా డ్యూటీ చేసే ధీర‌జ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్స్ ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అలా ట్రాన్స్‌ప‌ర్ మీద తిరువ‌ళ్లూర్ వ‌చ్చిన ధీరజ్‌.. వ‌రుసగా జ‌రిగే హ‌త్య‌ల కేసు పెండింగ్ ఉండటం చూసి దాన్ని టేక‌ప్ చేస్తాడు. తిరువ‌ళ్లూర్ జిల్లా వ‌రుస దోపీడీలు, హ‌త్య‌లు జ‌రుగుతుండ‌టంతో ధీర‌జ్ ఓ టీంను ఏర్పాటు చేసుని నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాడు. రాజ‌స్థాన్ ప‌రిసర ప్రాంతాల్లో ఉండే హ‌జ్‌పుత్ర వంశానికి చెందిన హ‌వేళీలే ఈ వ‌రుస హ‌త్య‌లు చేస్తున్నార‌ని తెలుసుకున్న ధీర‌జ్ త‌ర్వాత ఏం చేస్తాడు?  నేర‌స్థుల‌ను ఎలా ప‌ట్టుకుంటాడు?  ధీర‌జ్ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తాడో?  తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్లు:

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ కాప్‌గా, ఎదురింటి అమ్మాయిని ప్రేమ‌లో ప‌డేసే కుర్రాడిగా, పెళ్ల‌యిన కొత్త‌లో చిలిపి భ‌ర్త‌గా, త‌న కుటుంబ‌మా? ఈ స‌మాజ‌మా అని ఆలోచించాల్సిన స‌మ‌యంలో ప‌క్కా పౌరుడిగా కార్తి న‌ట‌న ఆక‌ట్టుకుంది. ర‌కుల్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో కాసింత ఒళ్లు చేసి పెళ్ల‌యిన కొత్త‌లో ఉన్న అమ్మాయిలాగానే క‌నిపించింది. అన్నిటిక‌న్నా ముందు ప్ర‌స్తావించాల్సిన వ్య‌క్తి హెచ్‌.వినోద్‌. ఫింగ‌ర్ ప్రింట్స్ తో, పాన్‌ప‌రాక్ క‌వ‌రు, ఒక చెప్పు సాయంతో త‌మిళ‌నాడు పోలీసులురీసెర్చ్ చేసి ప‌ట్టుకున్న నేర‌చ‌రిత్ర‌ను గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. తెర‌పై అంతే అందంగా క‌న్విన్సింగ్‌గా చెప్పారు. చ‌రిత్ర గురించి చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు తెర‌పై స్కెచ‌స్ వేసి చెప్పిన తీరు బావుంది. ట్రైల‌ర్‌లో రావుల‌పాళెం అన్ని చెప్పిన‌ప్ప‌టికీ, తెర‌మీద ఆయా ప్రాంతాల్లో జ‌రిగిన నేర‌చ‌రిత్ర‌ను గురించి, నిజ‌మైన అడ్ర‌స్‌ల‌తో చెప్ప‌డం కూడా బావుంది. పోలీసుల క‌ష్టాల‌ను ,  వాళ్ల‌కున్న ఒత్తిళ్ల‌ను చ‌క్క‌గా చూపించారు.  అభిమ‌న్యు సింగ్ అండ్ గ్యాంగ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.  `ఎంత దూరం` అంటే ఇంకో రెండు కిలోమీట‌ర్లే  అంటూ చెప్పే స‌న్నివేశం న‌వ్విస్తుంది.

మైన‌స్ పాయింట్లు:

పోలీసుల గురించి, వాళ్లు ప‌రిశోధ‌న చేసిన విధానం గురించి సామాన్య ప్ర‌జ‌ల‌కు తెలిసేలా తెర‌కెక్కించే  ఇలాంటి చిత్రాల్లో వినోదాన్ని, మామూలు క‌మ‌ర్షియల్ చిత్రాల్లో క‌నిపించే ఇత‌ర‌త్రా రిలీఫ్‌ని ఆశించ‌కూడ‌దు.  ఈ చిత్రంలో వినోద్ అందుకే కామెడీని పెట్ట‌లేదేమో. హీరోకి పెళ్ల‌యిన త‌ర్వాత అత‌ని త‌ల్లి,   చెల్లెలి గురించి చూపించ‌లేదు.  అస‌లు ఈ చిత్రంలో ఎవ‌రు ఎవ‌రో కూడా గుర్తుండ‌రు. అన్నీ కొత్త మొహాలే  క‌నిపిస్తాయి.హాజ్‌పుత్ వంశం గురించి, హ‌వేలీల గురించి సామాన్యుల‌కు ఎంత అర్థ‌మ‌వుతుందో చూడాలి.. సినిమా నిడివి కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

స‌మీక్ష:

కార్తి: కార్తి సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. పాత్ర కోసం ట్ర‌యినింగ్ తీసుకోవ‌డం, బ‌రువు త‌గ్గ‌డం వంటివి. అలాగే యాక్ష‌న్ సీన్స్ కోసం చాలా క‌ష్టప‌డ్డాడు. అలాగే నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థ‌లో హీరోగా న‌టించ‌డానికి అంగీరించ‌డం కూడా గొప్ప విషయం.

ర‌కుల్: ప్రియ అనే పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్‌లో న‌టించింది. త‌న పాత్ర‌లో పెర్ఫామెన్స్‌కు పెద్ద‌గా స్కోప్ క‌న‌ప‌డ‌లేదు.

అభిమ‌న్యుసింగ్: మెయిన్ విల‌న్‌గా న‌టించిన అభిమ‌న్యు పాత్ర ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. హ‌వేలీ వంశానికి చెందిన వ్య‌క్తిగా అభిమన్యు న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో తెలుగు, త‌మిళంలో ప‌రిచ‌యం లేని ముఖాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌తాయి. ప్ర‌తి పాత్ర‌లో న‌టించిన న‌టుడు..స‌ద‌రు పాత్ర‌కు న్యాయం చేశారు.

ద‌ర్శ‌కుడు: డైరెక్ట‌ర్ వినోద్ రెండేళ్ల క‌ష్టాన్ని సినిమా రూపంలో చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. నిజంగా జ‌రిగిన కేసుని సినిమా రూపంలో తీసుకురావ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు, ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో పెద్ద విజ‌యాన్ని సాధించాడు.

సంగీతం: జీబ్రాన్ సంగీతంలో ట్యూన్స్ పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌క‌పోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బావుంది.
సినిమాటోగ్ర‌ఫీః స‌త్య‌న్ సూర‌న్ ప్రతి స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్‌ను స‌త్య‌న్ అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఆకట్టుకునే స‌న్నివేశాలుః ఫ‌స్టాప్‌లో ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీన్‌..సీడ్ ఎడ్జ్ మూమెంట్‌గా చిత్రీక‌రించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో పోలీసులు ఓ నేర‌స్థుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. అలాగే క్లైమాక్స్‌లోని యాక్ష‌న్ సీన్‌.

అలాగే మంచి లోకేష‌న్స్‌లో సినిమాను తెర‌కెక్కించారు. సిన్సియ‌ర్ పోలీసుల‌కు డిపార్ట్‌మెంట్ కానీ, అధికారంలో ఉన్న‌వారు కానీ ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌రు. ఈ అంశాన్ని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సాంగ్స్‌ను వీలైనంత ట్రిమ్ చేసే చూపించారు.

ఆక‌ట్టుకోనివి: సినిమాలో పూర్తి కామెడీ ఉంటాడ‌నుకోవ‌డం త‌ప్పిదం. అలాగే సినిమా సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తుంది. పోలీస్ స్టోరీ అంటే సింగం త‌ర‌హా యాక్ష‌న్ మూవీ  అనుక‌ని వ‌స్తే నిరాశ ప త‌ప్ప‌దు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

బాటమ్ లైన్: సెల్యూట్ టు ఖాకి

Khakee Movie Review in English

Rating : 3.3 / 5.0