ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..
- IndiaGlitz, [Wednesday,August 05 2020]
వినాయకచవితి వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపూ ఖైరతాబాద్ వినాయకుని వైపే ఉంటుంది. ఆయన ఈ సారి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారు.. హైట్ ఎంత ఉండబోతోంది తదితర విషయాలన్నీ ఆసక్తికరమే. వినాయక చవితికి కొద్ది రోజుల ముందే ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం తయారీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వినాయకచవితి కోసం ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమవుతున్నాడు. నేడు విగ్రహ తయారీ కోసం పూజ నిర్వహించారు. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ గణనాధుడు దర్శనమివ్వనున్నాడు.
ఆయనకు శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా నామకరణం చేశారు. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణనాథుడు.. మట్టితో తయారు చేయనున్నారు. హుస్సేన్ సాగర్‌కి తరలించకుండా అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తోంది. ఈ సారి 9 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతి దర్శన మివ్వనున్నాడు. కరోనా కారణంగా భక్తులు ఎవ్వరు రావద్దని.. ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోవాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.