డిఫరెంట్ కథలతో తెలుగు, తమిళంలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో కార్తి. ఈ యువ హీరో చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం `ఖైదీ`. కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా తెరకెక్కిన ఖైదీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రాత్రిలో మాత్రమే ఈ సినిమాను చిత్రీకరించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవడానికి కథలోకి వెళదాం
కథ:
డ్రగ్స్ సరఫరా చేసే ముఠాపై రైడ్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ 900 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేస్తారు. దాంతో ముఠా నాయకుడు తమ సరుకు ఉన్న పోలీస్ స్టేషన్‌లోని పోలీసులందరినీ చేంపేసి తన సరుకుని తీసుకుని పోవాలనుకుంటాడు. అదే సమయంలో ఉన్నతాధికారి రిటైర్‌మెంట్ ఫంక్షన్‌లో ఉన్న పోలీసులు తాగే మద్యంలో డ్రగ్స్ కలిసేలా ముఠా నాయకుడు ప్లాన్ చేయడంతో పోలీసులందరూ అపస్మారక స్థితికి చేరుకుంటారు. వారికి సరైన కాలంలో వైద్య సాయం అందించకపోతే చనిపోయే స్థితికి పోలీసులు చేరుకుంటారు. ఆ సమయంలో అక్కడ మద్యం తాగని పోలీస్ ఆఫీసర్(నరైన్) పోలీసులను కాపాడాలనుకుంటాడు. అయితే అతనికి చేయి విరిగిపోయి ఉంటుంది. దాని కోసం సాయం కోసం తాము అరెస్ట్ చేసిన ఖైదీ ఢిల్లీ(కార్తి)ని సాయం అడుగుతాడు. పదేళ్ల యావజ్జీవ శిక్ష తర్వాత గడ్డం ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసిన పోలీసులకు ఢిల్లీ సాయం చేయడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? తన కుమార్తెను చూడాలనే తాపత్రయంలో ఢిల్లీ ఏం చేస్తాడు? పోలీసులను కాపాడే ప్రయత్నంలో ఢిల్లీకి ఎదురైన పరిస్థితులేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- కథ, కథనం
- కార్తి సహా నటీనటులు
- టేకింగ్
- బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్:
- లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
- రెగ్యులర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు
విశ్లేషణ:
ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో తొలి చిత్రం `నగరం`ను తెరకెక్కించిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్. రెండు సినిమాకు డైరెక్టర్ కార్తిని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కమర్షియల్ సినిమాలో, మరేదైనా యాక్షన్ ఎంటర్‌టైనర్‌నో తెరకెక్కించి ఉండొచ్చు కానీ.. లోకేశ్ మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. హీరోయిన్ లేకుండా.. పాటలు లేకుండా.. కేవలం రాత్రి వేళలో మాత్రమే సాగే కథతో సినిమాను తెరకెక్కించడం గొప్ప విషయం అయితే.. కేవలం ఓ సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడిని నమ్మి ఇలాంటి ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయడానికి ముందుకు వచ్చిన హీరో కార్తిని ఇంకా ఎక్కువగా అభినందించాలి.
డైరెక్టర్ లోకేష్ తనపై నిర్మాతలు, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని చెప్పాలి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సినిమాను తెరకెక్కించడంలో లోకేశ్ కనకరాజ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకు విభిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చిన కార్తి `ఖైదీ`తో మరో కొత్త ప్రయత్నం చేశాడు. యాక్షన్‌ను, ఎమోషన్స్‌ను చక్కగా క్యారీ చేశాడు. పోలీస్ అధికారి పాత్రలో నరైన్ కూడా చక్కగా నటించాడు. మిగతా నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సామ్ సి.ఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అలాగే సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ మెప్పిస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు లాజక్స్‌కు దూరంగా ఉండటం.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు సినిమా దూరంగా ఉండటంతో కామన్ కమర్షియల్ సినిమాల ప్రేక్షకుడికి సినిమా నచ్చకపోవచ్చు.
చివరిగా.. `ఖైదీ`.. డిఫరెంట్ అటెంప్ట్
Comments