KGF Review
తొలిసినిమా `ఉగ్రం`తో సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ... కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న కథ `కె.జి.ఎఫ్`. కన్నడలో క్రేజ్ ఉన్న యష్ హీరోగా మూడేళ్ల పాటు యూనిట్ పడ్డ కష్టంతో ఈ చిత్రాన్ని రెండు అధ్యాయాలుగా తెరకెక్కించారు. అందులో తొలి అధ్యాయం విడుదలైంది. సాధారణంగా చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించే కన్నడ చిత్రసీమలో వందకోట్ల రూపాయాల బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. అంతే కాదు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కావడం మరో కొసమెరుపు. సినిమా ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను `కె.జి.ఎఫ్` అందుకుందా? లేదా? అనే సంగతులు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
కథ:
సూర్యవర్ధన్‌కి తనుండే ప్రాంతంలో బంగారు గనులున్నాయని తెలుస్తుంది. ప్రభుత్వం దగ్గర ఏదో వ్యాపారం చేస్తున్నట్లు ఆ భూమిని లీజుకు తీసుకుంటాడు. దగ్గరి గ్రామాల్లో ప్రజలను అక్కడకు ఈడ్చుకొచ్చి బంధించి పనిచేయిస్తుంటాడు. సూర్యవర్ధన్ ఆరోగ్యం పాడవుతుంది. ఆయన సింహాసనంపై చాలా మంది కన్నేసి ఉంటారు. ముఖ్యంగా ఆయన కొడుకు గరుడని రాజుని చేస్తాడు. అయితే ఆయన క్రింద పనిచేసే రాజ్యవర్ధన్ సహా మరో నలుగురికి అది ఇష్టం ఉండదు. కథ ఇలా సాగుతుండగా.. అదే ప్రాంతంలో పుట్టిన రామకృష్ణ పవన్ అలియాస్ రాకీ(యష్) పెంచిన తల్లి కూడా క్యానర్స్‌తో చనిపోవడంతో .. ఈ లోకంలో డబ్బుకు ఎక్కువ విలువ అని తెలుసుకుని ముంభై చేరుకుంటాడు. అక్కడ శెట్టి దగ్గర చేరి పెరిగి పెద్దవుతాడు. క్రమంగా శెట్టి గ్యాంగులో కీలక సభ్యుడిగా మారిపోతాడు. రాకీ గురించి తెలుసుకున్న రాజ్యవర్ధన్, గరుడను చంపితే ముంభై నీ వశం చేస్తానంటాడు. దాంతో బెంగళూరులో గరుడను చంపే ప్రయత్నం చేసి విఫలమైన రాకీ.. తనను కె.జి.ఎఫ్‌లో చంపాలనుకుంటాడు? అసలు రాకీ కె.జి.ఎఫ్ ఎందుకు వెళ్లాలనుకుంటాడు? గరుడను రాకీ చంపాడా? ఎలా చంపాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన బలం హీరో యష్.. సినిమా అంతటినీ తన భుజాలపైనే మోశాడు. సినిమా ఫస్ట్ సీన్ నుండి చివరి సీన్ వరకు అతని హీరోయిజమ్‌ను ఎలివేట్ చేసేలానే సినిమా రన్ అవుతుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్ర మరి తక్కువ. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఇందిరాగాంధీ(పేరు, చెప్పరూ ముఖం చూపరు కానీ.. లుక్ బట్టి మనమే అర్థం చేసుకోవాలి) ప్రైవేట్ పరమైన గనులను ప్రభుత్వపరం చేసుకునే క్రమంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో ఏం జరిగిందనే కథాంశాన్ని ఆసక్తికరంగా రాసుకున్నాడు. బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాల వివరణ బావుంది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్:
కథంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. దీంతో మిగతా పాత్రలకు సరైన ఎలివేషన్ లేకుండా పోయింది. తెలుగు ఛత్రపతి సినిమా కాన్సెప్ట్‌లాగానే ఈ సినిమా కూడా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ అంతా అలాగే సాగుతుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌లో అనుకోకుండా పెట్రోల్ ట్యాంక్ రావడం వంటి సీన్స్.. హీరోను అతి బలవంతుడిగా చూపించడం .. వంటివి అతిశయోక్తిగా అనిపిస్తాయి. పాటలు గొప్ప ఏం లేవు. నేపథ్య సంగీతం పరావాలేదంతే...
సమీక్ష:
సినిమా కథను కె.జి.ఎఫ్ అనే బ్యాక్‌డ్రాప్‌లోనే సాగేట్టు సినిమాను నడిపించాడు దర్శకుడు. తొలి హాప్‌లో హీరోయిజంపైనే సినిమా ఎలివేట్ అవుతుంది. ఇక సెకండాఫ్ అంతా ఛత్రపతిని కాస్త డెప్త్‌గా తీస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ను కాస్త అటు, ఇటుగా మార్చి తీసినట్టు అనిపించింది. అయితే క్లైమాక్స్‌లో, తొలి సన్నివేశంలో చూపే సీన్‌కు ఉన్న లింకేంటి? ఓ జర్నలిస్ట్ హీరోను, అతని క్యారెక్టర్‌ను అంతగా పొగడటం వెనుకున్న అంతర్యమేంటనే విషయాన్ని కంటిన్యూ చేసేలా సెకండాఫ్‌కు లింక్ పెట్టాడు. టేకింగ్, మేకింగ్ కోసం పెట్టిన ఎఫర్ట్ సూపర్బ్. మూడేళ్లతో ఇంత పెద్ద సినిమాను చేయడ గొప్పగానే ఉంది. అయితే హీరోయిజంపైన ఉండే ఫోకస్ ఇతర పాత్రలపై చూపలేకపోయాడు దర్శకుడు. దీంతో సినిమా అంతా మరీ హీరో మయంగానే కనపడుతుంది. సినిమాలో హీరో, హీరోయిన్‌కి మధ్య సాంగ్స్ లేవు. కామెడీ ట్రాక్ లేదు. పక్కా మాస్ యాక్షన్ సినిమాలా అనిపిస్తుంది.
బోటమ్ లైన్: కె.జి.ఎఫ్.. వన్ మేన్ షో
Read 'KGF' Movie Review in English
- Read in English