‘సలార్’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Sunday,February 28 2021]

‘కేజీఎఫ్’ చిత్ర యూనిట్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోందంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. అదీకాకుండా ఆ చిత్రంలో ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ హీరో అంటే ఉండే క్రేజ్‌ను అంచనా వేయడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అందరి ఎదురుచూపులకు తెరదించుతూ చిత్ర యూనిట్ అసలైన, కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ‘సలార్’ చిత్రం ఏప్రిల్‌ 14, 2022న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘కేజీఎఫ్’ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమా రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.

రవి బస్రూర్‌ ‘సలార్‌’కు సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌నీల్‌ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో చిత్రీకరించారు. రాజుకు కుడి భుజంగా ఉండే వ్యక్తిని ‘సలార్‌’ అని అంటారు. సైన్యాధిపతి (కమాండర్‌ ఇన్‌ చీఫ్‌) నుంచి ఆ పదం వచ్చిందని గతంలో ప్రశాంత్ నీల్ వివరించారు.