జగన్ గృహప్రవేశానికి కీలకనేత డుమ్మా..!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం రోజున అమరావతిలోని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ, ముఖ్యనేతలు విచ్చేశారు. అయితే జగన్ బాబాయ్, వైసీపీకి పెద్ద దిక్కు, ఒంగోలు ఎంపీ అయిన వైవీ సుబ్బారెడ్డి రాకపోవడం గమనార్హం. సుబ్బారెడ్డి డుమ్మా కొట్టడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమానికి అయినా ముందుండే నడిపే వైవీ సుబ్బారెడ్డి ఎందుకు రాలేదు..? ఆయన జగన్‌పై అసంతృప్తితో ఉన్నారా..? ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన రాకపోవడమేంటి..? ఎవరొచ్చినా రాకపోయినా సుబ్బారెడ్డి తప్పక రావాల్సింది ఎందుకు డుమ్మా కొట్టారు..? అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట.
గత నెల రోజులుగా ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులొస్తున్నాయ్.. ముఖ్యంగా నేతల జంపింగ్‌లు చాలా వేగంగా జరిగిపోతున్నాయ్. అసలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఎక్కడ్నుంచి ఎవర్ని బరిలోకి దింపాలని పార్టీ అధినేత మొత్తం జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీకి పెద్ద దిక్కు, బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి మాత్రం అటు ఎమ్మెల్యేగానీ.. ఎంపీ టికెట్ ఇస్తానని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదట. అందుకే ఆయన ఒకింత ఆగ్రహం, అలకబూనారని తెలుస్తోంది. కాగా 2014 ఎన్నికల్లో వైవీ సుబ్డారెడ్డి ఒంగోలు పార్లమెంట్ తరఫున పోటీచేసి గెలుపొందారు.
రేపో మాపో టీడీపీ కీలకనేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ తరుణంలో మాగుంట వైసీపీ తీర్థం పుచ్చుకుంటే కచ్చితంగా ఒంగోలు పార్లమెంట్ గానీ అసెంబ్లీగానీ అడగటం పక్కా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆయనొస్తే తన సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోనని భావించిన వైవీ సుబ్బారెడ్డి ముందుగానే.. ‘గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిని తీసుకొచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఒంగోలు నుంచి నేనే బరిలో ఉంటాను. మాగుంట పార్టీలోకి వస్తే ఆయన సేవల్ని మరో రూపంలో వాడుకుంటాం. వేరొక పార్టీలో నుంచి వచ్చే వారికి టికెట్లు లేవ్.. మా పార్టీలోనూ మగాళ్లున్నారు’ అంటూ అప్పట్లో ఆయన గట్టిగా మాట్లాడిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలు మాగుంటను ఉద్దేశించే అన్నారని స్పష్టంగా అర్థం చేస్కోవచ్చు.
సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో పార్టీలోకి రావడానికి సిద్ధమైన వారు కూడా రాకుండా పోతున్నారని కొందరు నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో బాబాయ్‌కు ఫోన్ చేసిన జగన్..‘ ఏంటిది బాబాయ్.. ఏ మాటలివి.. మనం ఆహ్వానించాల్సింది పోయి.. ఇలా చేస్తే ఎలా’ అని అన్నారట. దీంతో సుబ్బారెడ్డి అసంతృప్తికి లోనయ్యారట. అందుకే గృహప్రవేశానికి రాకుండా డుమ్మా కొట్టారని తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మెడికల్ చెకప్ అని ఆస్పత్రికి వెళ్లారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి చూస్తే.. ఆయన ఎందుకు రాలేదో ఏమోగానీ.. ఈయన గురించి మాత్రం ఏపీ రాజకీయాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments