చైనా నిఘా వర్గాలకు కీలక సమాచారం చేరవేత.. జర్నలిస్ట్ అరెస్ట్..
- IndiaGlitz, [Sunday,September 20 2020]
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా నిఘా వర్గాలకు ఆయన చేరవేస్తున్నారని తేలడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దేశ రహస్యాలను చేరవేసినందుకు ప్రతిఫలంగా ఆయన రూ.45 లక్షలు పొందినట్టు పోలీసులు తెలిపారు. రాజీవ్ శర్మ చైనా నిఘా వర్గాలకు దేశ రక్షణకు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను అధికార రహస్యాల చట్టం కింద సెప్టెంబరు 14న అరెస్టు చేశారు. ఈ కేసులో రాజీవ్ శర్మతో పాటు ఓ చైనా మహిళ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ పీఠంపురకు చెందిన రాజీవ్ శర్మ జర్నలిస్టుగా 40 ఏళ్లుగా కొనసాగుతున్నారు. గతంలో పలు మీడియా సంస్థల్లో పని చేసిన రాజీవ్ శర్మ.. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు ఫ్రీలాన్సర్‌గా కూడా పని చేశారు. కాగా.. భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని చైనా నిఘా గూఢాచార సంస్థలకు రాజీవ్ శర్మ చేరవేసినట్టు ఢిల్లీ ప్రత్యేక విభాగం డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ వెల్లడించారు. చైనా ఇంటెలిజెన్స్ అధికారి మైఖేల్‌కు రాజీవ్ శర్మ 2016లో సమాచారాన్ని చేరవేశాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకసారి రాజీవ్ శర్మ చైనాకు కూడా వెళ్లొచ్చాడని.. 2018 వరకూ ఈ వ్యవహారం కొనసాగిందని సంజీవ్ కుమార్ తెలిపారు.
రాజీవ్ శర్మ చేరవేసిన కీలక సమాచారంలో భారత్-చైనా సరిహద్దు వివాదం, అక్కడి ప్రస్తుత పరిస్థితులు, వాస్తవాధీన రేఖ వద్ద సైన్యం మోహరింపు, రక్షణ కొనుగోళ్లు వంటి అంశాలున్నాయని సంజీవ్ కుమార్ తెలిపారు. రాజీవ్ శర్మను విచారిస్తే మరిన్ని కీలక సమాచారం బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు రాజీవ్ శర్మ కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ‘రాజీవ్ కిష్కింద’ పేరున గతేడాది రాజీవ్ శర్మ యూ ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. అయితే రాజీవ్‌శర్మ అరెస్ట్‌ను ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. తమకు సమాచారం ఇచ్చిన అనంతరం మాత్రమే దేశంలోని ఏ జర్నలిస్ట్‌ను అయినా అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది.