Pensions in AP: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గతంలో పింఛన్ల పంపిణీ విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్న ఈసీ.. గతంలో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని కుదరని పక్షంలో నగదు బదిలీ చేయాలని తెలిపింది. వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.
ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి తేల్చిచెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఇంటింటి పింఛన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఈసీకి లేఖలు రాశారు.
దీంతో ఈసీ స్పందిస్తూ ఈమేరకు లేఖలు జారీ చేసింది. కాగా ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటింటి పింఛన్లు చేయకపోవడంతో చాలా మంది వృద్ధులు ఎండల్లో సచివాలయాల దగ్గరకి వచ్చి వడదెబ్బకు గురై మరణించారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి అలాంటి తప్పులు జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో పోలింగ్ విధులకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులను వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్నందున వీరి సేవలను వినియోగించుకోవాలని సూచించింది. అలాగే పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు ఫాం-12 స్వీకరణ గడువును మే ఒకటో తేదీ వరకు పొడిగించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout