YCP :వైసీపీ ఆరో జాబితాలో కీలక మార్పులు.. కొన్ని స్థానాల్లో రివర్స్ నిర్ణయాలు..

  • IndiaGlitz, [Saturday,February 03 2024]

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. దీంతో అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఐదు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. తాజాగా ఆరో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నాలుగు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఇంఛార్జ్‌లను వెల్లడించింది.

రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్‌, నర్సాపురం పార్లమెంట్ ఇంచార్జ్‌గా గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ స్థానంలో రెడ్డప్పను ఇంఛార్జ్‌గా ప్రకటించారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ ఇంఛార్జ్‌గా నాగార్జున రెడ్డి, మార్కాపురం అసెంబ్లీ ఇంఛార్జ్‌గా అన్నా రాంబాబులకు అటూ ఇటూ మార్పులు చేసింది. ఇక ఎమ్మిగనూరు స్థానానికి బుట్టా రేణుక, జీడీ నెల్లూరుకు నారాయణస్వామి, మైలవరం నుంచి తిరుపతిరావు, నెల్లూరు సిటీ నుంచి ఎండీ ఖలీల్‌లకు చోటు కల్పించింది.

అయితే ఈ జాబితాలో కొన్ని రివర్స్ నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు ఎంపీ, గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాను తిరిగి పాత వారికే కట్టబెట్టింది. చిత్తూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికి, గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపుతూ గతంలో నియమించింది. ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. రెడ్డెప్పను తిరిగి చిత్తూరు ఎంపీ స్థానానికి, నారాయణస్వామిని గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికే కేటాయించింది. దీంతో అధిష్టానం నిర్ణయం క్యాడర్‌కు మింగుడు పడటం లేదు.

మరోవైపు అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు వైవీ సుబ్బారెడ్డిని రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావుని డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.