టీడీపీ జంపింగ్ ఎంపీలపై కేశినేని సెటైర్లే.. సెటైర్లు!
- IndiaGlitz, [Saturday,July 06 2019]
టీడీపీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత తాము రాష్ట్రాభివృద్ధి కోసమే వెళ్లామని.. ఇలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడేశారు. ఈ చేరిక తర్వాత పలువురు టీడీపీ నేతలు రియాక్ట్ అవుతూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అయితే తాజాగా..ఆ నలుగురు రాజ్యసభ ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినాని సెటైర్ల వర్షం కురిపించారు. ఈ మధ్య ఫేస్బుక్ వేదికగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న నాని తాజాగా చేసిన ఆ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు.
మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ...!
మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో అని నాని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఒకప్పుటి సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడిన కేశినేని నాని వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
కాగా.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు రియాక్ట్ అవ్వగా టీడీపీకి టాటా చెప్పి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీలు మాత్రం కనీసం స్పందించలేదు. దీంతో కేశినేని పై విధంగా రియాక్ట్ అయ్యారు. అయితే తమపై విమర్శలు గుప్పిస్తే.. స్ట్రాంగ్ కౌంటర్లిచ్చే సుజనా, సీఎం రమేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.