Keshava Review
స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్‌లో ఉన్న హీరో నిఖిల్ విలక్షణమైన సినిమాలను చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నిఖిల్‌తో తొలిసారి క్రైమ్ కామెడి స్వామిరారాతో సక్సెస్ ఇచ్చిన సుధీర్ వర్మ మలి ప్రయత్నంలో డిఫరెంట్‌గా రివేంజ్ డ్రామాగా 'కేశవ' చిత్రాన్ని తెరకెక్కించాడు. నిఖిల్, సుధీర్‌వర్మ హిట్ కాంబినేషన్ కావడంతో కేశవ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి కేశవ ఈ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..
కథ:
కేశవ(నిఖిల్) తల్లిదండ్రులు చిన్నప్పుడే కారు యాక్సిడెంట్‌లో చనిపోతారు. పెరిగి పెద్దవాడైన కేశవ్ కాకినాడ లా కాలేజ్‌లో చదువుకుంటూనే తన కుటుంబం చావుకు కారణమైన వారిపై కేశవ పగ తీర్చుకోవాలనుకుంటాడు. అయితే కేశవకు హార్ట్ డిజార్డర్ ఉంటుంది. ఆ కారణంగా ఎక్కువ ఎమోషనల్ అయితే చనిపోతాడని డాక్టర్స్ చెప్పడంతో తను చేయాలనుకున్న హత్యలను పక్కా ప్లాన్‌తో అమలు చేస్తాడు. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొంత మందిని చంపేస్తుంటాడు. వరుస పోలీసు హత్యలను చూసి పోలీసు శాఖ, హత్యలను విచారణ చేయడానికి సెషల్ ఆఫీసర్(ఇషా ఇషా కొప్పికర్)ను నియమిస్తారు. ఇషా గోపీకర్ కేసుని విశ్లేషిస్తున్న తరుణంలో కేశవపై అనుమానం వస్తుంది. ఓ సందర్భంలో ఇషా ఇషా కొప్పికర్ హత్యలను చేస్తుంది నిఖిలేనని అరెస్ట్ చేస్తారు. అయితే ఏ సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషిగా భావించి వదిలేస్తారు. మరో పక్క కేశవ కాలేజ్ మేట్స్ అయిన సత్యభామ(రీతూవర్మ), ప్రియదర్శిలు కూడా కేశవను ముందు అనుమానించినా తర్వాత అతను ఎందుకు హత్యలు చేస్తున్నాడో తెలియడంతో కేశవకు సపోర్ట్ చేస్తుంటారు. చివరకు హార్ట్ డిజార్డర్ ఉన్న కేశవ తన పత్రీకారం ఎలా తీర్చుకున్నాడు? కేశవ సాక్ష్యాలతో పోలీసులకు చిక్కుతాడా? సత్యభామ, ప్రియదర్శిలు కాకుండా కేశవకు ఇంకెవరెవరు సపోర్ట్ చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- ఫస్టాఫ్
- నిఖిల్
- సినిమాటోగ్రఫీ
- సంగీతం
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్
- కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ కావడం
విశ్లేషణ:
హీరో కుటుంబం చనిపోవడంతో సినిమా మొదలవుతుంది. హీరో పెద్ద అయిన తర్వాత తన హత్య చేయడంతో సినిమాలో అసలు ట్విస్ట్ ప్రారంభం అవుతుంది. ఒక పక్క హీరో లా కాలేజ్‌లో చదువు, అతని ఫ్రెండ్స్, వారి మధ్య సిచ్యువేషనల్ కామెడితోపాటు పోలీసులు నిఖిల్‌ను చేజ్ చేయడం, పోలీసులను తప్పించుకుంటూ నిఖిల్ హత్యలు చేయడం వరకు ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఎప్పుడైతే సెకండాఫ్ స్టార్టవుతుందో అక్కడ నుండి స్క్రీన్‌ప్లేలో గ్రిప్పింగ్ తగ్గింది. హార్డ్ డిజార్డర్ ఉన్న హీరో, అతని తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోవడానికి కారణమైన వారిని చంపడం అనే పాయింట్‌కు లింక్ చేసిన విధానం ఓకే. కానీ సెకండాఫ్ అంతా రివేంజ్ మీదనే నడవడం, అసలు హీరో హత్యలకు కారణం సెకండాఫ్ స్టార్టింగ్‌లో తెలియడంతో కథలో ఆసక్తి సన్నగిల్లింది. హీరో హత్యలు చేస్తూ పోతుంటే పోలీసులకు హంతకుడు నిఖిల్ అని తెలిసినా అతన్ని ఏం చేయరు. నటీనటుల విషయానికి వస్తే నిఖిల్ తన పాత్రలో ఒదిగిపోయాడు. రగ్‌డ్ లుక్‌తో తన పాత్రకు న్యాయం చేశాడు. రీతూ వర్మ పాత్ర పరిమితమే అయినా తను చక్కగా నటించింది. చాలా కాలం తర్వాత నటించిన ఇషా గోపీకర్ స్పెషల్ ఆఫీసర్ పాత్రలో మంచి నటనన కనపరిచింది. అజయ్, బ్రహ్మాజీ పాత్రలను హీరో చాలా సింపుల్‌గా చంపేస్తాడు. ఒక వ్యక్తి తమను చంపేస్తాడని తెలిసినా వారు ఏ ప్రొటెక్షన్ లేకుండా ఎందుకు ఉంటారో తెలియదు. దర్శకుడు సుధీర్ వర్మ ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సెకండాఫ్‌లో కాస్తా కేర్ తీసుకుని ఉంటే బావుండేదనిపించింది. వెన్నెలకిషోర్ క్లాస్‌రూం కామెడి ఆడియెన్స్‌ను నవ్విస్తుంది. నిఖిల్ సినిమాల్లో సత్య కామెడి కీలకంగా ఉంటుంది. కానీ కేశవలో సత్య రోల్ చాలా పరిమితం. ఉన్న కాస్తా కామెడి పెద్దగా నవ్వించలేదు. సన్ని ఎం.ఆర్. సంగీతం బావుంది. అలాగే ప్రశాంత్ పిళ్ళై బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రతి సీన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.
బోటమ్ లైన్: కేశవ...ప్రథమార్థం బాగానే ఉంది..ద్వితీయార్థం ప్రతీకారానికే ప్రాముఖ్యతనిచ్చాడు
Keshava English Version Review
- Read in English