Aravana prasadam : అయ్యప్ప భక్తులకు షాక్.. శబరిమల ‘‘అరవణ’’ ప్రసాదం విక్రయాలు నిలిపివేత, కారణమిదే

  • IndiaGlitz, [Thursday,January 12 2023]

భారతదేశంలోని మూల మూలలా ఎన్నో ప్రతిష్టాత్మక ఆలయాలున్నాయి. వాటికి తగ్గట్టుగా ఆహార కథలు కూడా వున్నాయి. ఇక్కడ ఆహారం అంటే ప్రసాదం. తిరుమల లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం, పూరి జగన్నాథుడి ప్రసాదం బాగా ఫేమస్. అలాంటి వాటిలో ఒకటి శబరిమల అయ్యప్ప ఆలయంలో అందించే ‘‘అరవణ ప్రసాదం’’. బియ్యం, బెల్లం, నేతితో తయారు చేసే ఈ ప్రసాదాన్ని శబరిమల ఆలయానికి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులకు పంచుతూ వుంటారు. అలాంటి అరవణ ప్రసాదానికి సంబంధించి భక్తులకు షాకిచ్చింది కేరళ హైకోర్ట్. శబరిమలలో అరవణ ప్రసాదం తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ హైకోర్ట్ బుధవారం ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది.

ఆ యాలకులలో క్రిమి సంహారకాలు :

ప్రసాదం తయారీకి ఉపయోగించే యాలకులలో ప్రమాదకరమైన 14 రకాల క్రిమి సంహారకాలు వున్నాయని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన కేరళ ఉన్నత న్యాయస్థానం అరవణం విక్రయాలను వెంటనే నిలిపివేయాలని తీర్పు వెలువరించింది. భక్తుల ఆరోగ్యంపై ప్రభావం లేకుండా ప్రసాదం తయారు చేయాలని సూచించింది. న్యాయస్థానం ఆదేశాలతో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి శబరిమల దేవస్థానంలో ప్రసాదాల విక్రయాలు నిలిపివేశారు. అలాగే ఇప్పటికే నిల్వ వున్న 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ధ్వంసం చేయనున్నారు అధికారులు. అయితే కోర్టు సూచించిన యాలకులను వినియోగించకుండా అరవణం ప్రసాదాన్ని తయారు చేసి గురువారం నుంచి విక్రయాలను పునరుద్దరిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు తెలిపింది.

ప్రసాదాన్ని ఇంటికే డెలివరీ చేసిన తపాల శాఖ:

అరవణ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కర ట్రావెన్‌కోర్ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. శబరిమలలో ఏటా 80 లక్షల ప్రసాదాలు తయారవుతాయని అంచనా. అరవణ ప్రసాదానికి వున్న డిమాండ్ దృష్ట్యా రెండేళ్ల క్రితం కరోనా కారణంగా శబరిమల వెళ్లలేని వారికి తపాల శాఖ ప్రసాదాన్ని ఇంటికే తెచ్చే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.