మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా..
- IndiaGlitz, [Wednesday,February 24 2021]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. మోదీ సొంత రాష్ట్రంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాగా వేశారు. ఆదివారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. ఇప్పటి వరకూ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో సూరత్ కార్పోరేషన్లో రెండవ అతిపెద్ద పార్టీగా ఆప్ నిలిచి.. బీజేపీకి సవాల్ విసిరింది. దీంతో ఆప్‌కు పంజాబ్, గోవా తర్వాత గుజరాత్లో బలపడే అవకాశం లభించినట్టైంది.
సూరత్ కార్పొరేషన్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫిబ్రవరి 26వ తేదీన సూరత్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన ఖరారైంది. సూరత్ కార్పొరేషన్లో మొత్తం 120 వార్డులుండగా బీజేపీ 93 గెలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కూడా రాలేదు. ఈ ఫలితాలపై ఆమ్ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ తరహా పాలన గుజరాత్‌లోనూ అవసరమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికర విషయం కూడా చోటు చేసుకుంది. గుజరాత్లో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పోటీ చేసింది. అహ్మదాబాద్ ముస్లిం ఆధిపత్య జమాల్పూర్, మక్తాంపూరా వార్డులలో ఏడు స్థానాలను ఏఐఎంఐఎం గెలుచుకోవడం విశేషం.
ఇటు ఆప్, అటు ఏఐఎంఐఎం గుజరాత్ ఎన్నికల్లో నిలవడమే కాకుండా కొన్ని స్థానాలను కూడా కైవసం చేసుకోవడం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మోదీ హవా దేశంతో పాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లోనూ తగ్గిందంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆరు కార్పొరేషన్లలో ఒక్క సూరత్ తప్పా మిగతా చోట ఆప్ బోణీ చేయకపోవడం గమనార్హం.