Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఒకేరోజు రెండు షాక్‌లు..
Send us your feedback to audioarticles@vaarta.com
లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటిసులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ లోపు సమాధానం చెప్పాలని ఈడీని ఆదేశించింది. అంతకుముందు తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను రెండు కోర్టులు తిరస్కరించగా ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణను వాయిదా వేసింది.
ఇక కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కస్టడీ ముగియడంతో తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేస్తారని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని తెలిపారు. రూ.100 కోట్ల ముడుపులు తీసుకుని, వ్యాపారులకు అనుకూలంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేసారని పేర్కొన్నారు. దీంతో ఆయన కస్టడీని పొడిగించాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇటు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడటం.. అటు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించండతో ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కొన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత కోర్టు ఏప్రిల్ 15 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తన అరెస్టుపై సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 'సీఎంకు ఓ న్యాయం, సామాన్యులకో ఓ న్యాయం అనేది ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. నిందితుడి వీలుని బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు.' అని పేర్కొంది. తాజాగా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments