కేజ్రీవాల్.. వైఎస్ జగన్ నోట ఒకే మాట..!
- IndiaGlitz, [Monday,May 04 2020]
‘కరోనా మహమ్మారిని ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు. కాబట్టి దాంతో కలిసే సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకైనా, మీకైనా ఇంకెవరికైనా ఈ వైరస్ సోకవచ్చు.. అందుకు భయపడాల్సిన పనిలేదు. ఇది కూడా సాధరణ జ్వరమే’ అని ఇటీలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే.. కరోనాతో సహజీవనం ఏంటి..? అసలు జగన్ ఏం మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఒంటికాలిపై లేచాయి. అంతటితో ఆగని విమర్శకులు.. ‘అందరూ కరోనాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంటే.. జగన్ మాత్రం సహజీవనం చేయాల్సి ఉంటుంది’ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే చివరికి.. ఎస్.. ఇది నిజమే అని ప్రధాని నరేంద్ర మోదీ, పలుదేశాల అధిపతులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలువురు శాస్త్రవేత్తలతో పాటు ఇన్ఫోసిస్ నారాయణ సైతం జగన్ మాటలను ఏకీభవించారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, నెట్టింట్లో విమర్శించిన వారి గొంతులో వెలక్కాయపడ్డట్లు అయ్యింది. అంతేకాదు.. జగన్ మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారికి కూడా అంతేరీతిలో వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పంచ్‌ల వర్షం కురిపిస్తూ విశదకీరించి మరీ చెప్పారు.
కేజ్రీవాల్ నోట.. జగన్ మాట
అయితే.. తాజగా ఢిల్లీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జగన్ మాటలను ఏకీభవిస్తూ మాట్లాడారు. ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన.. ‘ఢిల్లీనీ రీ- ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది.. మనం కరోనా వైరస్‌తో కలసి జీవించడానికి సిద్ధం కావాలి’ అని ట్వీట్ చేశారు. అంటే.. లాక్ డౌన్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నామని ఇందుకు కేంద్రం సహకరించాలని పరోక్షంగా ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 దశలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పరిమిత ఆంక్షలతో అనుమతించే సేవలు, పరిశ్రమల జాబితాను నిశితంగా వివరించారు.
వీటికి మాత్రమే అనుమతి..
‘ప్రజారవాణా ఇదివరకటి లాగే నిషేధిస్తాం. ప్రైవేటు వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నాం. కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. అందులో ఒకరు డ్రైవర్.. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అలాగే ద్విచక్ర వాహనంపై మాత్రం ఒక్కరికే ప్రయాణించి అవకాశం ఉంటుంది. ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకోవచ్చు.. అయితే 33 శాతం సిబ్బందినే మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది. ఐటీ హార్డ్‌వేర్ తయారీ, నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఈ-కామర్స్ కార్యకాలాపాలు వంటివి ఈ జాబితాలోనే ఉంటాయి. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది చొప్పున అనుమతి ఉంటుందని కేంద్రం చెప్పిన మార్గదర్శకాలనే పాటించాలి. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. బహిరంగ ప్రదేశాలలో ఉమ్ములు వేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేజ్రీవాల్ మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేశారు.