బిగ్ బ్రేకింగ్: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య
- IndiaGlitz, [Wednesday,October 14 2020]
మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆయన ఏసీబీకి అడ్డంగా చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉన్న నాగరాజు.. జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించాయి. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి చెంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన నేడు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ నాగరాజు పట్టుబడ్డారు. భారీ స్థాయిలో తహశీల్దార్ డబ్బులు లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీకి సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి తహశీల్దార్ నాగరాజు లంచం డిమాండ్ చేశాడు. దానికి సంబంధించిన కోటి పది లక్షల రూపాయల డబ్బును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఉప్పల్‌లోని శ్రీ చౌలా శ్రీనాథ్ యాదవ్, శ్రీ సత్య డెవలపర్ల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో స్పష్టమైంది.
నాగరాజు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు.. కీలక ఆస్తులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. కేసులో విచారణను వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసుతో సంబంధమున్న నలుగురు నిందితులను నేటి నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నాగరాజు వద్ద భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ నాగరాజు కారులో రూ. 8 లక్షలు, అతని ఇంట్లో రూ.28 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే 500 గ్రాముల బంగారు ఆభరణాలు, లాకర్ కీ దొరికాయి. అనేక స్థిరాస్తులు ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి.