సరదా కోసం బయటికి రావడం మూర్ఖత్వం: కీరవాణి
- IndiaGlitz, [Wednesday,April 22 2020]
లాక్‌డౌన్ సమయంలో సరదా కోసం కొందరు బయటికొస్తున్నారని.. నిజంగా అలా రావడం మూర్ఖత్వం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి వ్యాఖ్యానించారు. ఇవాళ ఓ ప్రముఖ మీడియా చానెల్‌కు ఆన్‌లైన్‌లో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సరదా కోసం బయటికొచ్చేవారు.. ఇతరుల ప్రాణాలనూ రిస్క్‌లో పెడుతున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. లాక్ డౌన్ వేళ మనకు కావాల్సినవన్నీ సమకూరుతున్నాయ్.. అలాంటప్పుడు ఇక బయటికి తిరగాల్సిన అవసరమేంటి..? అని కీరవాణి ప్రశ్నించారు.
నీటి ఎద్దడి ఇంకా భయపెడుతోంది..
వాస్తవానికి ఇప్పుడున్న లాక్‌డౌన్ కన్నా లాంగ్ గ్యాప్ ఇంట్లోనే ఉన్న రోజులున్నాయని ఆయన తెలిపారు. లైఫ్‌లో తాను ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశానన్నారు. ఇంతకంటే ఎక్కువ ఉత్పాతాలనే చూశామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కరోనా అనేది ప్రకృతి మనల్ని మందలించినట్లుగా ఉందని కీరవాణి వ్యాఖ్యానించారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమన్నారు. నీటి ఎద్దడి అనేది కరోనా కంటే ఎక్కువగా భయపెడుతోందన్నారు.
కరోనాలా పాకుతోంది..!
ఇటీవలే.. దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చేసిన ఛాలెంజ్‌ను కీరవాణి పూర్తి చేశారు. తన ఇంట్లో బట్టలు ఉతికి ఆరేస్తూ, తువాళ్లను మడత పెడుతూ కీరవాణి కనిపించారు. అంతేకాదు.. మొక్కలకు నీళ్లు పోసి, డైనింగ్ టేబుల్ తుడిచినట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో బ్యాగ్రౌండ్‌లో ‘సై’ సినిమాకు ఆయన కంపోజ్ చేసుకున్న పాటనే జోడించారు. ఈ ఛాలెంజ్‌పై మాట్లాడిన ఆయన.. ఇది కరోనా వైరస్‌లా పాకుతోందన్నారు. తనతో పాటు, ఇతరులు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారని చెప్పారు. తాను ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశానని.. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు థమన్‌ను కీరవాణి నామినేట్ చేసిన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన పనులను కీరవాణి ఇంట్లో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు.