నందమూరి సుహాసిని భవితవ్యంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

  • IndiaGlitz, [Saturday,December 29 2018]

నందమూరి సుహాసిని.. గత ఎన్నికల ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కూకట్ పల్లి స్థానానికి టీడీపీ తరపున అనూహ్యంగా చంద్రబాబు ఈమెను బరిలో దింపి ఆశ్చర్యపరిచారు. నందమూరి హరికృష్ణ కూతురైన సుహానిని తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నందమూరి సుహాసిని ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూజ్ అండ్ త్రో పాలసీకి అలవాటు పడిన చంద్రబాబు చివరకు నందమూరి సుహాసిని కూడా అలాగే మోసం చేశారని విమర్శించారు. నందమూరి హరికృష్ణ శవంతో కూడా చంద్రబాబు రాజకీయం చేశారని ఘాటుగా మండిపడ్డారు.

గతంలో హరికృష్ణను వాడుకుని వదిలేసిన చంద్రబాబుకు ఇటీవలి వరకూ ఆయన కుటుంబం గుర్తురాలేదని విమర్శించారు. నందమూరి హరికృష్ణ మరణంతో ఏర్పడిన సానుభూతిని కూడా ఓట్ల రూపంలో మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. తన మానాన తాను ఉన్న సుహాసినిని రాజకీయాల్లోకి తెచ్చి ఇప్పుడు గాలికి వదిలేశారన్నారు.

కూకట్ పల్లి ఎన్నికల్లో ఓడిపోయిన నందమూరి సుహాసినికి ఇప్పుడు ఏమైనా పదవి చంద్రబాబు కట్టబెడతారా అని ప్రశ్నించారు కేసీఆర్. ఆమెకు ఏదైనా పదవి ఇస్తాడని తనకు ఏమాత్రం నమ్మకం లేదని తెలంగాణ సీఎం అన్నారు. మరి కేసీఆర్ ప్రశ్నకు చంద్రబాబు ఎలా సమాధానం చెబుతారో చూడాలి.