చిరుకు కేసీఆర్ ఊహించని గిఫ్ట్..!

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చేశారు. అదెలాగని ఆశ్చర్యపోతున్నారా..? తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టడంతో ప్రజా రవాణా కుంటుపడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి పూర్తిస్థాయిలో లేవని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది కేసీఆర్ సర్కార్.

ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే 10 రోజులకు పైగా సెలవులు ఇచ్చిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు మరోవారం రోజులు పొడిగించడం ఒకరకంగా చిరుకు శుభవార్తేనని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ఈ సెలవుల విషయం తెలుసుకున్న ‘సైరా’ డిస్ట్రిబ్యూటర్లు ఆనందానికి అవధుల్లేవట.

పండుగలు, సెలవు దినాల్లో ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేయడానికి సదరు దర్శకనిర్మాతలు ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇలా వరుస సెలవులు కలిసొస్తే డబుల్ ధమాకా. తాజాగా కేసీఆర్ సర్కార్ సెలవులు పొడిగించడంతో ‘సైరా’కు బాగా కలిసొచ్చినట్లయ్యింది. అంటే వారం రోజులపాటు ‘సైరా’కు కలెక్షన్లే కలెక్షన్లన్న మాట. వాస్తవానికి సినిమా వచ్చి 10 రోజులు అవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లకు మాత్రం ఏ మాత్రం కొదువలేకుండా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ. 100 కోట్ల షేర్ వైపు అడుగులు వేస్తోంది. అయితే తాజాగా కేసీఆర్ దసరా సెలవులు పొడిగించడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.