కేసీఆర్ యాగం.. ఆ వెంటనే కేటీఆర్‌కు సీఎం యోగం..!
- IndiaGlitz, [Monday,January 18 2021]
తెలంగాణలో కీలక మార్పు జరగనుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినప్పటికీ దీనికి ముహూర్తం కూడా సెట్ అయిందనే వార్త ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సీఎం కేసీఆర్ తనయుడికి పదవిని అప్పగించబోతున్నారట. కేసీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన యాదాద్రిలో మరో యాగాన్ని చేపట్టబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెలాఖరు నాటికి యాదాద్రి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం.
కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించే చివరి కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. ఈ యాగం పూర్తయిన వెంటనే కేటీఆర్‌కు సీఎంగా పదవీ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా ఆయన అనుకూల మీడియా ఛానెల్ సైతం ఈ విషయాలను ప్రసారం చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్టైంది. మొత్తమ్మీద రెండు నెలల్లో కేటీఆర్ సీఎం కావడం ఖాయమని సదరు మీడియా చెబుతోంది. మరోవైపు ఫిబ్రవరి 18న కేటీఆర్‌కు సీఎం పదవిని అప్పగించబోతున్నారంటూ సోషల్ మీడియాలో మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. దీంతో మొత్తానికి తేదీ ఫిక్సా.. కాదా? అనేది తెలియదు కానీ వీలైనంత తొందరలో మాత్రం కేటీఆర్ సీఎం పదవిలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే యాదాద్రితో గర్భగుడి మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా పనులు జనవరి నెలాఖరు వరకు పూర్తయితే.. ఫిబ్రవరి నెలలో యాగాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. త్వరలోనే యాగాలతో పాటు ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. యాగాల అనంతరం కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆ వెంటనే కేటీఆర్ సీఎం పదవిని చేపడతారని తెలుస్తోంది. ఇదంతా ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో ఖచ్చితంగా సీఎంగా కేటీఆర్ పదవి బాధ్యతలు తీసుకుంటారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...