ప్రజా ప్రతినిధులకు వార్నింగ్.. రైతన్నకు అభయం!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదని.. రేపట్నుంచి రంగంలోకి దిగి క్రియాశీలకంగా పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రైతన్నలకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్లో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన పరిస్థితులు.. తాజా పరిణామాలపై మాట్లాడారు.
మీరంతా ఏం చేస్తున్నారు..?
‘కరోనాపై యుద్ధంలో కేవలం అధికారులే కనిపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఎక్కడికెళ్లారు..?. హైదరాబాద్లోని 150 మంది కార్పొరేటర్లు ఏమయ్యారు..? ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే మీరేం చేస్తున్నారు..?.. మీకు బాధ్యత లేదా..?. ఆపత్కాల సమయంలో ప్రజల మధ్యే మనం ఉండాలి. ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాల్సిందే.. చౌరస్తాలో నిలబడాల్సిందే. ప్రజల కోసం పనిచేసేందుకు మనల్ని గెలిపించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లాలి.. ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో ఉండాలి. గ్రామ పంచాయితీల్లో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను క్రియాశీలకం చేయాలి. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనాల్సిందే. సిగ్నళ్లు, కూడళ్ల వద్ద నిలుచుని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలి. ప్రతి సర్పంచ్.. ఆగ్రామానికి కథా నాయకుడు కావాలి. స్టాండింగ్ కమిటిలో 10లక్షల మంది ఉన్నారు.. వారంతా ప్రజా సైన్యంలా తయారు కావాలి. షూట్ ఎట్ సైట్ పరిస్థితి రాకుండా ప్రజా ప్రతినిధులంతా పనిచేయాలి. ’ అని కేసీఆర్ ప్రకటించారు.
రైతన్నలూ దిగులొద్దు..
‘వరి, మొక్కజొన్న పంటల కొనుగోళ్లను ప్రభుత్వం చేపడుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరూ పట్టణాల్లో ఉన్న మార్కెట్ కమిటీ కేంద్రాలకు రావొద్దు.. వాటిని మూసివేస్తున్నాం. గ్రామాల్లోనే రైతులకు కూపన్లు ఇచ్చి వారి సొంతూళ్లలోనే కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. చెక్కుల ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తాం. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెంచినవారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. మరీ ఇంత దుర్మార్గమా...? ప్రపంచమంతా హడలిపోతున్న తరుణంలో డబ్బులు దండుకోవాలని ప్రయత్నిస్తారా?. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని రకాల షాపులను సాయంత్రం 6గంటలకు మూసేయాలి. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏ షాపు తెరిచినా సీజ్ చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అనుమతిస్తున్నాం. గుంపులుగా కాకుండా.. కొద్దిమందితో పనులు చేసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా చేసుకోవచ్చు. చాలా గ్రామాలు కంచెలు వేసుకుంటున్నాయ్.. ఇది చాలా మంచి పరిణామం. మన రాష్ట్ర సరిహద్దుల్లో టోల్ ప్లాజాల దగ్గర ఈ రాత్రికి మినహాయింపు ఇస్తాం.. ఉదయానికల్లా వారు గమ్యస్థానాలు చేరుకోవాలి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్.. రైతన్నకు మాత్రం అభయమిచ్చారన్న మాట.
ప్రజలారా.. కనిపిస్తే కాల్చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు: కేసీఆర్
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘తెలంగాణలో ప్రజలు పోలీసుల మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి ఉంటుంది.. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ (కనిపిస్తే కాల్చివేత) తప్పదు. అయినా పరిస్థితి మారకపోతే సైన్యాన్ని దించకతప్పదు. ఇలాంటి దుస్థితి మనకు అవసరమా..?’ అని ప్రజలు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్లో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన పరిస్థితులు.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇప్పటి వరకూ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు పాకిందని.. దాదాపు అన్ని దేశాలకు పాకిందని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా.. తెలంగాణ విషయానికొస్తే విదేశాల నుంచి వచ్చిన వారు, వారు కలిసిన వారితో కలిపి మొత్తం 19,300 మందిపై నిఘా ఉంచామన్నారు.
ప్రజలు సహకరిస్తేనే..!
‘క్వారంటైన్లో ఉంచిన వ్యక్తులు తప్పించుకుని పోతున్నారు. నిర్మల్లో ఓ వ్యక్తి అలా మూడుసార్లు తప్పించుకున్నాడు. 114 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తున్నాం. వారికి వైద్యపరీక్షలు నిర్వహించాం.. రేపు ఫలితాలు వస్తాయి. ఇది ఒక ప్రాంతానికే పరిమితైన సమస్య కాదు. ప్రజలు వందశాతం సహకరిస్తేనే నివారణ సాధ్యం. అమెరికాలో పరిస్థితిని పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ఆర్మీని దించారు. అగ్రరాజ్యంలోనే అలాంటి పరిస్థితి వచ్చింది. కలరాతో పాటు ఎన్నో మహ్మమ్మారుల నుంచి బయటపడ్డాం.. ఇప్పుడు కరోనాపై ఉమ్మడిగా విజయం సాధిద్దాం’ అని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments