తొక్కిపడేస్తాం జాగ్రత్త.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి: కేసీఆర్ వార్నింగ్
- IndiaGlitz, [Wednesday,February 10 2021]
ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా హాలియాలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతుండగా కొందరు నిరసన తెలపడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సభలో నిరసన తెలిపిన వారిని ఉద్దేశిస్తూ.. కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని, వేరే పార్టీ సభకు వచ్చి వీరంగం చేస్తామంటే ఎవరూ హర్షించరని కేసీఆర్ పేర్కొన్నారు.
పిచ్చిపనులు బంద్ చేసుకుంటే మంచిదని కేసీఆర్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. సహనానికి, పిచ్చి వాగుడుకు ఒక హద్దుంటుందని.. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. చాలా మంది రాకాసులతోనే కొట్లాడామని.. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. ఢిల్లీ నామినేట్ చేస్తే వచ్చే ప్రభుత్వం తమది కాదని కేసీఆర్ పేర్కొన్నారు. నాడు మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్ల ఇవ్వకుంటే ఓట్ల అడగబోమని చెప్పామని.. మాట నిలబెట్టుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. అలాగే ఇప్పుడు కూడా ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి చూపుతామన్నారు
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కిరణ్‌కుమార్ అన్నారని.. ఆనాడు ఒక్క కాంగ్రెస్ నేత అయినా మాట్లాడారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. నేడు కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారని.. మీరు నాగార్జునసాగర్ కమీషన్ల కోసమే కట్టారా? అని నిలదీశారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య గురించి ఒక్కరైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా వస్తుందన్నందుకు పోరుబాట చేస్తారా? అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదు. విజయడెయిరీ మూసివేస్తే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదన్నారు. టీఆర్ఎస్ వీరుల పార్టీ అని.. వెన్ను చూపించే పార్టీ కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.