Brahmanandam:ఘనంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం.. కేసీఆర్, వెంకయ్య నాయుడు, పవన్ హాజరు

  • IndiaGlitz, [Saturday,August 19 2023]

ప్రముఖ సినీ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్ధ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కే చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజా వినయ్‌ దంపతుల కుమార్తె ఐశ్వర్య మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. నగరంలోని అన్వయ కన్వెన్షన్స్‌లో సిద్ధార్ధ- ఐశ్వర్యల వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ , మోహన్ బాబు తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

ఇకపోతే.. బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌ తండ్రి అడుగుజాడల్లో సినీ రంగ ప్రవేశం చేశారు. కొన్ని చిత్రాల్లో హీరోగా చేసిన ఆయన తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమకు దూరంగా వుంటున్నారు. రెండో కుమారుడు సిద్ధార్ధ్ తొలి నుంచి చిత్ర పరిశ్రమకు , మీడియాకు దూరంగా వుంటూ వచ్చారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన.. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సిద్ధార్ధ్‌కు వివాహం చేయాలని నిశ్చయించిన బ్రహ్మానందం.. ఈ ఏడాది మేలో ఐశ్వర్యతో పెళ్లి నిర్ణయించారు. అదే నెలలో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.