అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్ చేత ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో ఆయన పూజలు చేశారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలోని గేట్ నెంబర్-1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇవాళ మాత్రం గేట్ నెంబర్-2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలవగా.. కామారెడ్డి నుంచి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలగా ఎన్నికైన నేతలందరూ ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి వైద్యులు తుంటి ఎముకకు ఆపరేషన్ చేశారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అనంతరం నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కేసీఆర్.. మంచి ముహుర్తం ఉండటంతో నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు త్వరలోనే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరి నుంచి ముఖ్యమంత్రి హోదాలో సభానాయకుడిగా ఆయన అసెంబ్లీలో ఉండేవారు. ఇప్పుడు తొలిసారిగా విపక్ష నేతగా ఉండనున్నారు. అటు కేసీఆర్ ప్రత్యర్ధి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో సభానాయకుడిగా ఉండనున్నారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments