KCR: అప్పుడు తెలంగాణ కోసం పోరాటం.. ఇప్పుడు ఉనికి కోసం ఆరాటం.. ఎందుకిలా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నడూ ఎదుర్కోని సందిగ్థత పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలతో పార్టీని బతోపేతం చేశారు. పరిస్థితులకు తగ్గట్లు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో తెలంగాణలో బలమైన పార్టీగా పేరు దక్కించుకున్నారు. తెలంగాణవాసులు అందరూ తమ ఆస్థిత్వం నిలబడాలంటే కేసీఆర్ పార్టీతోనే సాధ్యమని భావించారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన జరిగి 2014లో దశాబ్దాల కల అయిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి తన చాణక్యంతో పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేశారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీతో విజయం సాధించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఊపుతో పనిచేస్తూ వచ్చారు.
అయితే ఇదే ఊపులో దేశంలోనూ చక్రం తిప్పాలని భావించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అక్కడి నుంచే ఆ పార్టీ పతనం మొదలవుతూ వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజలు తమ ప్రాంత పార్టీగా గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటిది తెలంగాణ పేరు తీసి ఆ స్థానంలో భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చడం చాలా మంది ప్రజలకు నచ్చలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలపడకుండా బీజేపీ ఎదుగుదలకు సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదం జనాల్లోకి బాగా వెళ్లింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన హస్తం పార్టీకి ఓటు వేసి గెలిపించారు. దీంతో కేసీఆర్‌కు కష్టాలు మొదలయ్యాయి. గత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏలిన కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలన నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. దీంతో కేసీఆర్‌కు పార్టీని కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారింది.
ఇప్పటిదాకా తన మాట జావదాటని నేతలు ఇప్పుడు తనను ధిక్కరించి పార్టీని వదిలి వెళ్లడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం పార్టీ తరపున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరక్కపోవడం కూడా ఆయనను మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అసలే కష్టాల్లో ఉన్న సమయంలో కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం పార్టీకి బాగా డ్యామేజ్ అయింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి పార్టీని నిలబెట్టుకోవాలనుకున్న గులాబీ బాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లైంది.
ఈ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోకపోతే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అసాధ్యం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గులాబీ ఎమ్మెల్యేలను లాక్కొని బీఆర్ఎస్ఎల్పీని పార్టీలో విలీనం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పార్టీని నిలబెట్టుకోవాలన్నా..? నిలబెట్టాలన్నా..? ఎక్కువ ఎంపీ సీట్లు గెలవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని పైకి లేపితే ఓట్లు చీలి మూడోసారి అధికారంలోకి వస్తామనే భావనలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితికి కారణంగా పేర్కొంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout