KCR:తెలంగాణ ప్రజలపై కేసీఆర్ వరాలు జల్లు.. రూ.400కే గ్యాస్ సిలిండర్.. పింఛన్ రూ.5వేలకు పెంపు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సబ్బండ వర్గాలే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. జనాకర్షక పథకాలు ప్రకటించారు. కొంతకాలంగా మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేసిన గులాబీ బాస్.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలకు ధీటుగా హామీలు ఇచ్చారు. దేశానికే ఆదర్శంగా తమ పథకాలు ఉంటాయని వెల్లడించారు. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇవ్వని రైతు బంధు, కల్యాణ లక్ష్మి, విదేశీ విద్య, దళిత బంధు వంటి పథకాలు అమలుచేశామన్నారు. దాదాపు 99శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
రూ.400లకే గ్యాస్ సిలిండర్..
అర్హులైన ప్రజలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం రూ.400లకే సిలిండర్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని హామీ ఇచ్చారు.
ఆసరా పింఛన్లు రూ.ఐదు వేలకు పెంపు..
ఆసరా పథకం కింద మొదట రూ.1000 ఇచ్చామని.. తర్వాత దాన్ని రూ.2016 చేశామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఏకంగా రూ.5వేలకు పెంచుతున్నామన్నారు. తమ ప్రభుత్వం రాగానే మొదటి ఏడాది అంటే మార్చి తర్వాత రూ.3వేలు ఇస్తామని.. ఇలా ఏడాదికి రూ.500 పెంచుకుంటూ రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు. ఏపీలో సీఎం జగన్ ఇదే విధంగా విజయవంతంగా అమలు చేశారని చెప్పారు. అలాగే దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుకుంటూ వెళ్తామని ఆయన వెల్లడించారు. వచ్చే మార్చిలో రూ.5వేలు చేస్తామని.. అక్కడి నుంచి ఏడాదికి రూ.300 పెంచుతామన్నారు.
ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా..
రైతు బీమా తరహాలో 'కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికీ ధీమా' పేరుతో పథకం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వమే ఎల్ఐసీకి డబ్బులు చెల్లించి తద్వారా ఈ బీమా వర్తింపజేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం అందచేస్తామని.. దీనికి ఒక్కో కుటుంబంపై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు కానుందని చెప్పుకొచ్చారు. కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే పది రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు.
రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం..
ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు.
రైతుబంధు రూ.16వేలకు పెంపు..
రైతు బంధు పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.10వేలను రూ.16వేలకు పెంచుతామని.. రూ.12వేల నుంచి ఏడాదికి రూ.1000 చొప్పున పెంచుకుంటూ వెళ్తామన్నారు.
మహిళలకు సౌభాగ్య లక్ష్మి..
అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మి పేరుతో నెలకు రూ.3వేల భృతి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.15 లక్షలకు పెంపు.
కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో సాధారణ ప్రజలతోపాటు జర్నలిస్టులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు.
ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు..
ప్రభుత్వ ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయనం..
దళిత బంధు కొనసాగింపు
ముస్లిం బడ్జెట్ పెంపునకు హామీ
అనాథుల కోసం ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు
డ్వాక్రా సంఘాలకు సొంత భవననాలు
అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత
51 మందికే బీఫాంలు అందజేత..
అంతకుముదు అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. బీఫాంలతో పాటు ఎన్నికల ఖర్చులకు రూ.40లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందించారు. అయితే 115 మంది అభ్యర్థుల్లో కేవలం 51 మందికే కేసీఆర్ బీ ఫామ్స్ అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ప్రకటించిన తొలి జాబితాలో కొంతమంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో బీఫాం అందని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com