వైఎస్ జగన్ సూపర్బ్.. చూసి నేర్చుకో కేసీఆర్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెల్లెల్లిగా పార్టీలో ఉన్న విజయశాంతి అలియాస్ రాములక్క.. కాంగ్రెస్ గూటికి చేరి ఇప్పుడు అదే అన్నపై విమర్శలు గుప్పిస్తూ ఒంటికాలిపై లేస్తున్నారు. గతం గురించి పక్కనెడితే.. మీడియా ముందుకు పెద్దగా రాని రాములమ్మ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన నాటి నుంచి కేసీఆర్ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతూ.. పదే పదే విమర్శిస్తున్నారు. అయితే విజయశాంతి ఇంత వరకూ లేనిపోని మాటలన్నా.. కేసీఆర్ కుటుంబాన్ని సైతం విమర్శించినప్పటికీ టీఆర్ఎస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. అసలు ఆ రియాక్ట్ కాకపోవడం వెనుక అసలేముందో ఆ పెరుమాళ్లకే ఎరుక.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా ..!
అయితే తాజాగా మరోసారి కేసీఆర్ సర్కార్‌పై తన ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగి 5 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తోందన్నారు. ఓ వైపు బంగారు తెలంగాణ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం.. స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన తీరుపై చివరకు కోర్టు కూడా నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోందని విజయశాంతి చెప్పుకొచ్చారు.
జగన్‌ను చూసి నేర్చుకో కేసీఆర్..!
"మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.. స్పీకర్‌ను ఎన్నుకొని ఆయన పదవిలో కూర్చున్న వెంటనే అధికారపక్షం తరఫున కీలకమైన ఒక తీర్మానం చేయడం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించే ప్రసక్తే లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని ఏపీకి చెందిన అధికార వైఎస్‌ర్ పార్టీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో అధికారపక్షం చేస్తున్న అరాచకాలకు చెంపపెట్టులాంటిది. జగన్‌ను చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాఠాలు నేర్చుకోవాలని డైలాగులు చెప్పి.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాళ్లకు చక్రాలు కట్టుకు తిరిగిన కెసిఆర్ గారు ఏపీ లో జరిగే పరిణామాల మీద ఏ రకంగా స్పందిస్తారని తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారు" అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
అంటే.. జగన్ సూపర్బ్ పాలన చేస్తున్నారు.. ఆయన్ను చూసి కేసీఆర్ చాలా నేర్చుకోవాలని పరోక్షంగా విజయశాంతి చురకలు అంటించారన్న మాట. కాగా.. గతంలో కూడా వైఎస్ జగన్-కేసీఆర్‌ను పోలుస్తూ రాములక్క పలు పోస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా వ్యాఖ్యలపై టీఆర్ఎస్, వైసీపీ నుంచి ఎలా రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments