30 శాతం పీఆర్సీ ప్రకటన.. కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

  • IndiaGlitz, [Monday,March 22 2021]

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులందరిపై వరాల జల్లు కురిపించారు. నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ముందుగా చెప్పినట్టుగానే పీఆర్సీని ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కరోనా, ఆర్థిక మాద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మరో సంచలన నిర్ణయం సైతం తీసుకున్నారు. గతంలో పీఆర్సీ వర్తించని వర్గాలకు సైతం ఈసారి వర్తింజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వోద్యోగులపై వరాల జల్లు..

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు సైతం పీఆర్సీ వర్తిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. అలాగే వీఆర్ఏలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు సైతం పీఆర్సీని వర్తింపజేస్తున్నట్టు వెల్లడించారు. టీచర్ల అంతర్ జిల్లాల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కస్తూర్బా స్కూల్స్ ఉద్యోగినులకు 150 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల ప్రామాణికంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. 9 లక్షల 17 వేల 797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు వర్తించనుంది. తెలంగాణలో పని చేసే ఏపీ ఉద్యోగులు స్వరాష్ట్రానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్ల వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదించారు.

అడ్డంకులన్నీ తొలిగి...

కాగా.. ఇప్పటి వరకూ పీఆర్సీ ప్రకటనకు ఉన్న అడ్డంకులన్నీ తాజాగా తొలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో పీఆర్సీ ప్రకటనకు ఈసీ నుంచి ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ మేరకు ఈ నెల 20న రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇందుకు ఈసీ వెంటనే స్పందించింది. పీఆర్సీ ప్రకటించడంపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ సీఈసీ కార్యదర్శి అవినాశ్‌కుమార్‌ ఆదివారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి లేఖ రాశారు. అయితే ఉప ఎన్నికపై ప్రభావం పడకుండా దీనిని అమలు చేయాలని, ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేసేందుకు మార్గం సుగమమైంది.