Modi:కేసీఆర్, రేవంత్.. అందుకే కామారెడ్డిలో పోటీచేస్తున్నారు: మోదీ

  • IndiaGlitz, [Saturday,November 25 2023]

పదేళ్ల కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఈసారి జనం బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదని.. సాగు, తాగు నీటి ప్రాజెక్టులన్ని అవినీతితో నిండిపోయాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్‌ఎస్‌ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పారు.

అలాగే ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర యువతను బీఆర్‌ఎస్‌ ఘోరంగా మోసం చేసిందని మండిపడ్డారు. పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారని విమర్శించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలని.. వాటిని నమ్మకూడదని వివరించారు. యూపీఏ ఇండియా కూటమిగా మారితే.. టీఆర్‌ఎస్‌ హఠాత్తుగా బీఆర్‌ఎస్‌గా మారిందన్నారు.

కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని.. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం ఇక్కడి ప్రజలకు వచ్చిందన్నారు. తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మోదీ భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించామని.. ప్రత్యేక కమిటీ వేశామని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని.. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మరోసారి స్పష్టంచేశారు.