కాకతాళీయంగా జరిగింది.. సహృదయంతో అర్థం చేసుకోండి: కేసీఆర్

  • IndiaGlitz, [Friday,July 10 2020]

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాలను కూల్చి వేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి కాస్త దెబ్బతిన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్త సచివాలయం నిర్మించడమే తమ ఉద్దేశమని ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖర్చుతో దేవాలయం, మసీదులను నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘కొత్త భవన సముదాయం నిర్మించడానికి ఎత్తయిన భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందని తెలిసి ఎంతో బాధపడుతున్నాను... చింతిస్తున్నాను. కొత్త సచివాలయం నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో దేవాలయం, మసీదులను నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తాం. నిర్వాహకులతో త్వరలోనే సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’ అని కేసీఆర్ ట్వీట్‌లో కోరారు.