కేంద్రం ప్యాకేజీ దరిద్రం.. ఆ ముష్టి మాకొద్దు : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కష్ట కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ఐదు దఫాలుగా పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా మీట్ నిర్వహించి నిశితంగా వివరాలు వెల్లడించారు. ఈ ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి తీవ్ర స్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. కేంద్రం ప్యాకేజీ మొత్తం బోగస్ అని.. ఇది చాలా దుర్మార్గమైన ప్యాకేజీ అని కేసీఆర్ ఆరోపించారు. అవసరమైతే కేంద్రం ఇచ్చే ముష్టి రూ. 2500 కోట్లు ప్యాకేజీ వ్యతిరేకిస్తామని అది రాష్ట్రానికి అక్కర్లేదని కేసీఆర్ తేల్చిచెప్పేశారు. కేంద్రం ప్యాకేజీ పచ్చి మోసం, దగా, అంకెలగారడి.. అంతా గ్యాస్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. కేంద్రం తన పరువును తానే తీసుకుందని చెప్పుకొచ్చారు. దీని ఫలితం ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందన్నారు.
కండిషన్స్ చూస్తే నవ్వొస్తోంది..!
‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా లాంటి ఒక ఘోర విపత్తు సంభవించిన సమయంలో కేంద్ర ప్రకటించిన ప్యాకేజీ దుర్మార్గంగా ఉంది. కరోనా దేశాన్ని నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది నగదు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు వస్తే అది ప్రజల్లోకి పంపిణీ అవుతుంది. ఇలా మేం అడిగితే కేంద్రం మాత్రం రాష్ట్రాలను బిక్షగాళ్లలాగా భావించి ఉత్త బోగస్ ప్యాకేజీ ప్రకటించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ కూడా చెబుతున్నాయి. 2% FRBM పెంచారు.. కానీ కండిషన్స్ చూస్తే మాత్రం నవ్వొస్తుంది. రాష్ట్రానికి 20వేల కోట్లు మాత్రమే వస్తుంది. ఇదంతా అప్పుగా రాష్ట్రం కట్టుకోవాల్సిందే. ఇది కేవలం రుణ పరిమితి మాత్రమే.. రాష్ట్రం కట్టుకోవాల్సిందే.. కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వదు’ అని కేసీఆర్ చెప్పారు.
ఐయామ్ రియల్లీ ఫెయిన్ ఫుల్..!
‘అసలు కేంద్రం ఇచ్చిన దీన్ని ప్యాకేజీ అంటారా..? వాట్ ఈజ్ దిస్. ఐయామ్ రియల్లీ ఫెయిన్ ఫుల్. ఇది ఫెడరల్ వ్యవస్థ వ్యవహరించాల్సిన తీరేనా..?. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలపై ఇలా వ్యవహరించొచ్చా..?. ఇది ఎంత దుర్మార్గం.. విపత్కర పరిస్థితుల్లో ఇలా చేయొచ్చా..?. విద్యుత్, మార్కెటింగ్‌లో కేంద్రం చెప్పిన సంస్కరణలు చేయాలంట..? ఇది ఎంతవరకు సబబు..?. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసేదేముంది. ఆఖరికి మునిసిపాలీటల్లో ఆదాయం పెంచి.. ప్రజల మీద భారం వేస్తే రెండు వేల కోట్లిస్తారంట. అసలు ఇది ప్రోత్సహించే విషయమేనా..?. వన్ నేషన్- వన్ రేషన్ అని కేంద్రం చెబుతోంది.. ఇందులో మేం చాంపియన్స్ రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉంది’ అని కేసీఆర్ తెలిపారు.
ఇది చాలా అన్యాయం..!
‘రాష్ట్రాల మీద ఇలాంటి పెత్తనాలు చెలాయించడం సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కో ఆపరేటివ్ ఫెడరిలిజం అని ప్రధాని మోదీ చెప్పారు కానీ అది అంతా డొల్ల.. బోగస్ అని తాజా పరిణామాలు నిరూపితమైంది. కేంద్రం చాలా దారుణంలో ప్రవర్తి్స్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో ఇలా చేయొచ్చా..?. ఇది నిజంగా చాలా అన్యాయం.. మెడ మీద కత్తి పెట్టి ఇలా చెయ్.. అలా చెయ్ అని చెప్పడం ఎంతవరకు సబబు. కేంద్రం చేసే విధానం సరైనది కాదు. కేంద్రంవి అన్నీ దరిద్రపు షరతులు. అసలు కేంద్రాన్ని మేం అడిగింది ఇది కాదు.. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి’ అని కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com