నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. వరాలే వరాలు!
- IndiaGlitz, [Monday,December 02 2019]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా డైలాగ్స్ పేల్చారు. ఆదివారం నాడు ఇవాళ ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా విందు సమావేశం నిర్వహించారు. ప్రతి డిపో నుంచి కొందరిని పిలిపించిన కేసీఆర్ వారికి భోజనం పెట్టించి అనంతరం వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్వహణ ఆషామాషీ కాదని, అనేక విభాగాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నారు.
బక్కగా ఉన్నవాడు...!
‘ఓ ఇంట్లోనూ, బక్కగా ఉన్నవాడు, లావుగా ఉన్నవాడు.. పాసైనోడు, ఫెయిలైనోడు ఇలా రకరకాలుగా ఉంటారు. మరి ప్రభుత్వం కూడా అలాంటిదేనని అన్నారు. అందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో నేను చొరవ తీసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా నాకు మొండితనం ఎక్కువని, అసలీ సమ్మె వ్యవహారం ఎందుకు ఓ కొలిక్కిరాదని పట్టుదలగా తీసుకున్నాను. మీ సంగతేంటి..? అధికారులను అడిగితే, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, వంద శాతం మీ పేరు నిలబెడతామని చెప్పాం. ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్షోభం జరగనివ్వబోమని వారు హామీ ఇచ్చారు. నేను కూడా ఏమీ జరగదని గట్టినమ్మకంతోనే ఉన్నాను’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కార్మికులపై వరాల జల్లు..!
‘నేను పిలవడం, మీరు రావడం, ఇప్పుడీ సమావేశం అంతా సాఫీగా జరిగిపోయింది. సీఎం వద్దకు వెళ్లి ఏంతెచ్చారు?. మీ వాళ్లు అడిగితే సమ్మెకాలానికి పూర్తి జీతం తెచ్చాం. సమ్మె ఎన్నిరోజులు జరిగిందో అన్ని రోజులకు పూర్తి జీతం చెల్లిస్తాం. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతాను. మొత్తం ఒకే దఫాలో ఇస్తాం. యూనియన్లు, ఇతర రాజకీయాల జోలికి వెళ్లకుండా కష్టపడి పనిచేస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తాం’ అని కేసీఆర్ తెలిపారు.
చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు..!
‘సమ్మె కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబీకులకు 8 రోజుల్లోగా వారి అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం. కార్మికుల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. డ్రైవర్లకు వర్ణాంధత్వం వచ్చినా ఉద్యోగాల నుంచి తీసేయం. ఆర్టీసీ భవిష్యత్తు కార్మికుల చేతుల్లోనే ఉంది. కష్టపడి పని చేసి సంస్థను లాభాల్లో తీసుకెళ్తే.. సింగరేణి తరహాలో ఏటా బోనస్ ఇస్తాం. విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధిక వేతనం వస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలోనూ ఇది వంద శాతం జరుగుతుంది. తెలంగాణ సాధించగా లేనిది.. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం సాధ్యం కాదా?’ అని ఈ సందర్భంగా కార్మికులను ప్రశ్నించారు.
నాలుగు నెలల తర్వాత మళ్లీ..!
‘ఇవాళ వచ్చిన కార్మికులందరితో.. నాలుగు నెలల తర్వాత మళ్లీ కలుస్తా. ఈ నాలుగు నెలలు అహర్నిశలు శ్రమిద్దాం. సంస్థ మనుగడ కోసం కార్మికులు సహకరించాలి. అందరి కంటే ముందు ఆర్టీసీ అధికారులు మారాలి. ఉద్యోగులు, కార్మికులు అందరూ సమానమే. యాజమాన్యం, కార్మికులు అనే విభజన రేఖ తొలగిపోవాలి. అందరిదీ ఒకటే కుటుంబం. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంట్‌గా పెడతాం. 5000 రూట్లు కాదు కదా.. ఒక్క రూట్లోనూ ప్రయివేట్ బస్సులను అనుమతించం. చైల్డ్ కేర్ లీవుల పెంపు సహా.. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. డిపోల్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తాం. మహిళా కండక్టర్లు, ఉద్యోగులు రాత్రి 8 గంటల్లోగా డ్యూటీ దిగేలా చర్యలు తీసుకుంటాం’ అని మహిళా కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.