ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగా 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సైతం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీటిలో 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్‌లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా మరో 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read: తెలంగాణ విద్యార్థికి కరోనా కష్టం.. చెట్టుపైనే ఐసొలేషన్..
కొత్తగా 6 మెడికల్ కాలేజీలు..
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆస్పత్రులకే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటులో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇకపై ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి ఉండొద్దని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీటిని సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు పరికరాల కొనుగోలు..
ప్రస్తుతం తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి చికిత్స అందించేందుకు కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రితోపాటు జిల్లాల్లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో పరికరాలు, అవసరమైన మందులను సమకూర్చాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్ మెషీన్లు, హెచ్‌డీ ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలన్నారు. ఇక వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆస్పత్రిని తక్షణమే కొవిడ్ చికిత్సకు ఉపయోగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతోపాటు సింగరేణి, ఆర్టీసీ, సీఐఎ్‌సఎఫ్, సీఆర్‌పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎ్‌సఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కొవిడ్ సేవలందించేందుకు వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments