తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్..
- IndiaGlitz, [Tuesday,October 20 2020]
తెలంగాణ సీఎం కేసీఆర్.. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. నగదు సాయం అందించి ఉదారతను చాటుకున్నారని పళనిస్వామిని కేసీఆర్ అభినందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘‘సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తమిళనాడు సీఎం శ్రీ పళనిస్వామికి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎంను అభినందించారు’’ అని సీఎంవో ట్వీట్లో తెలిపింది.
భారీ వర్షాలు, వరద బీభత్సంతో అల్లాడుతున్న తెలంగాణకు తామున్నామంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు సీఎం పళనిస్వామి సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణకు తక్షణం రూ.10 కోట్లు వరద సాయంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అంచనాలకు మించిన వరదతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమని పళనిస్వామి పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి తమిళనాడు ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రగాఢ సంతాపాన్ని.. వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతిని పళనిస్వామి ప్రకటించారు.
ముందస్తుగా రూ.10 కోట్లను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు బ్లాంకెట్లు, దుప్పట్లు, ఇతర సామగ్రి కూడా పంపాలని అధికారులకు సూచించనట్టు తెలిపారు. ఇక ముందు తెలంగాణకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు. దీంతో వెంటనే తమిళనాడు ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నేడు స్వయంగా పళనిస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తమిళనాడు సీఎం శ్రీ పళనిస్వామి కి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎం ను అభినందించారు.
— Telangana CMO (@TelanganaCMO) October 20, 2020